Saturday, January 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసంక్రాంతి ప్రయాణ తిప్పలు

సంక్రాంతి ప్రయాణ తిప్పలు

- Advertisement -

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ట్రాఫిక్‌ మళ్లింపు

నవతెలంగాణ,- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఏడాదీ ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది. హైదరాబాద్‌ నగరం నుంచి జనం పెద్దఎత్తున ఊర్లకు దారిపడుతుంటారు. ఈ క్రమంలో జాతీయ రహదారులపై రద్దీ తీవ్రంగా ఉంటుంది. వాహనాలు బారులు తీరుతుంటాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. టోల్‌గేట్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, జాతీయ రహదారిపై వంతెనల నిర్మాణం నత్తనడకన సాగుతూ ఉండటంలో భారీగా ట్రాఫిక్‌ జాం సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఈ సంక్రాంతికి సులువుగా ప్రయాణం సాగడం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది.

అందులో భాగంగా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా జాతీయ రహదారి 65 హైదరాబాద్‌- విజయవాడ ఉంది. నల్లగొండ జిల్లాలో 63 కిలోమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 25 కిలోమీటర్లు, సూర్యాపేట జిల్లాలో 66 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అయితే, ఈ రోడ్డు విస్తరణ ముందుకు సాగకపోవడం.. అక్కడక్కడా చేపట్టిన వంతెనల నిర్మాణాల పనుల్లో జాప్యం కారణంగా ట్రాఫిక్‌ సమస్య ఎక్కువగా ఏర్పడుతోంది. రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు జాతీయ రహదారి 65 పూర్తిస్థాయిలో గుంతల మయంగా మారిపోయింది.

10 లక్షల వాహనాల రాకపోకలు
గత సంవత్సరం సంక్రాంతి సమయంలో 65వ జాతీయ రహదారిపై సుమారు 9 లక్షల 97 వేల నాలుగు చక్రాల వాహనాలు, 7వేల బస్సులు రాకపోకలు జరిపాయి. జనవరి 11న ఒక్కరోజునే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లిన వాహనాలు 85 వేలకు పైగా ఉన్నట్టు టోల్‌గేటు సిబ్బంది ధ్రువీకరించారు. ఈసారి అంతకుమించి ఎక్కువ వాహనాలు వెళ్లే అవకాశం ఉందని, గతేడాది ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజులపాటు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున చిట్యాల వద్ద రహదారి పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ట్రాఫిక్‌ డైవర్షన్లు ఇలా…
భువనగిరి, హైదరాబాద్‌ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను నార్కట్‌పల్లి వద్ద నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా దారి మళ్లిస్తారు. నకిరేకల్‌, అర్వపల్లి, మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా మళ్లి టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాజమండ్రి వైపునకు పంపిస్తారు.

హైదరాబాద్‌-విజయవాడ
టేకుమట్ల డైవర్షన్‌ను ఎత్తివేయనున్నారు. టేకుమట్ల నుంచి ఖమ్మం జాతీయ రహదారికి వెళ్లి యూటర్న్‌ తీసుకొని తిరిగి సూర్యాపేట వైపునకు రావల్సి ఉండగా.. జాతీయ రహదారిపై సరాసరి వాహనాలు వచ్చే విధంగా తాత్కాలిక రహదారిని నిర్మించారు.

ఖమ్మం-హైదరాబాద్‌
రాయినిగూడెం వైపునకు వచ్చి యూటర్న్‌ తీసుకోవాల్సి ఉండగా.. చివ్వెంల, ఐలాపురం వద్ద దారి మళ్లించి సూర్యాపేట మీదుగా సరాసరి హైదరాబాద్‌ వెళ్లే విధంగా ప్రణాలికలను రూపొందించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 38 బ్లాక్‌ స్పాట్స్‌ ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 10, సూర్యాపేటలో 24, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 ఉన్నాయి. 65వ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్‌ స్పాట్స్‌ని గుర్తించినట్టు వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆర్‌ఎఫ్‌సి, పెదకాపర్తి, చిట్యాల, కొర్లపాడు, టేకుమట్ల తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

టోల్‌ గేట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
పంతంగి, కేతేపల్లిలో వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్‌ జామ్‌ అవ్వకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. పంతంగి టోల్‌ ప్లాజా దగ్గర ప్రస్తుతం 8 లైన్లు వాహనాలు వెళ్లేందుకు ఉండగా.. విజయవాడ వైపు సాఫీగా వెళ్లే విధంగా వాహనాల రద్దీ అనుగుణంగా 15 లైన్ల వరకు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు.

ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రత్యేక చర్యలు
చిట్యాల, పెద్దకాపర్తి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు నతనడకన సాగుతున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకొని వాహనాల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

వేగ నియంత్రణ ఉండాలి
హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు వెళ్లేవారు జాతీయ రహదారిపై వేగ నియంత్రణ పాటిస్తూ ప్రయాణం చేయాలి. వేగం ముఖ్యం కాదు.. గమ్యం చేయడం లక్ష్యంగా వాహనాలు నడపాలి.
-నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -