నవతెలంగాణ హైదరాబాద్: సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి వాహనాలతో నిండిపోయింది. శనివారం ఉదయం హైవేపై దారి పొడవునా వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవాలని.. గుంటూరు, ఒంగోలు వైపు వెళ్లేవారు సాగర్ హైవే మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు.
సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్‌లు సైతం ప్రయాణికుల రద్దీ పెరిగింది. దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక కూడళ్లు ప్రయాణికులతో సందడిగా మారాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మరోవైపు రైల్వేస్టేషన్లలో కూడా రద్దీ పెరిగింది.



