భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను కూడా ఒక ఆరాధనగా భావించి, సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు సంత్ గాడ్గే మహరాజ్. తన చేతిలోని మట్టిపాత్ర (గాడ్గే) పేరుతోనే గాడ్గే బాబాగా కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్ గ్రామంలో జన్మించిన తన 29 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలి సమాజ సేవ బాట పట్టారు. మట్టిపాత్రను తలపై పెట్టుకుని భిక్షాటన చేస్తూ తిరిగారు. ఆయన ఏ గ్రామానికి వెళ్లినా మొదట చీపురు పట్టి మురికివాడలను, వీధులను శుభ్రం చేసేవాడు. ”దేవుడిని ఆలయంలో వెతకకండి.. ముందుగా మీ గ్రామాన్ని శుభ్రం చేయండి” అని ఆయన ప్రజలకు చెప్పేవారు.
గ్రామాల్లో అపరిశుభ్రత నిర్మూలన కోసం ఆయన ప్రారంభించిన ‘చీపురు దండు’ ఉద్యమం నేటి ‘స్వచ్ఛ భారత్’కు పునాది వంటిది. గంగానది కాలుష్యరహితంగా ఉండాలని ఆయన ఆనాడే కలలు కన్నారు. గాడ్గే బాబా తన జీవితాంతం భిక్షాటన ద్వారా సేకరించిన ప్రతి పైసాను ప్రజా ప్రయోజనాలకే వెచ్చించారు. ఆయన ప్రేరణతో మహారాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అవసరాలకు ఉపయోగపడే అనేక నిర్మాణాలు జరిగాయి. 150కి పైగా విద్యా సంస్థలు, యాత్రికుల కోసం లెక్కలేనన్ని ధర్మశాలలు, అనాథలు, వృద్ధులు, కుష్టు రోగుల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే సంస్థల ట్రస్టుల్లో ఆయన తన కుటుంబ సభ్యులకు ఎక్కడా చోటు కల్పించలేదు. నిస్వార్థ సేవకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉండదు. ‘మీ కులం ఏమిటి?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘నేను మానవుడిని’ అని చెప్పి కులాల గీతలను చెరిపివేసేవారు.
పండరీపురంలో దళిత భక్తుల కోసం చొక్కమేళా పేరుతో ధర్మశాల నిర్మించి సామాజిక సమానత్వాన్ని చాటారు. అస్పృశ్యత అనేది సమాజానికి పట్టిన చీడ అని ఆయన గట్టిగా నమ్మారు. మూఢనమ్మకాలను పారదోలాలంటే చదువు ఒక్కటే మార్గమని గాడ్గే బాబా బోధించారు. ఆయన సేవా తత్పరతను చూసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన్ను గౌరవించగా.. మహాత్మాగాంధీ సైతం ఆయన కార్యదక్షతకు ముగ్ధులయ్యారు.గాడ్గే బాబా సేవలను ప్రభుత్వం గుర్తించి అనేక గౌరవాలను అందించింది. అమరావతి విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది. 1999లో భారత ప్రభుత్వం తపాలా స్టాంపు విడుదల చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ‘సంత్ గాడ్గే బాబా గ్రామ స్వచ్ఛతా అభియాన్’ అనే పథకాన్ని అమలు చేయడం ద్వారా ఆయన త్యాగాన్ని, సేవలను ఆచరణలో పెట్టింది.1956 డిసెంబర్ 20న గాడ్గే బాబా భౌతికంగా దూరమైనా ఆయన విడిచిన చీపురు, అందించిన జ్ఞానం నేటికీ సమాజాన్ని శుభ్రపరుస్తూనే ఉన్నాయి. అయితే, మన ప్రధాని చేపట్టిన ‘స్వచ్ఛభారత్’లాగా మాటలకే పరిమితం కాకుండా చేతల్లో నిరూపించిన వ్యక్తి సంత్ గాడ్గే మహరాజ్.
ఇ.చంద్రశేఖర్
9848822333

