– తుమ్మలకు యూనివర్సిటీ ప్రతిపాదనలు
– పంటల సాగు అంచనాతోనే పథకాలు :మంత్రి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలను అంచనా వేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావుకు ప్రతిపాదనలు చేసింది. పంటల నమోదులో ఎస్‌ఏఆర్ డాటా వినియోగం ప్రాముఖ్యతను వివరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో యూనివర్సిటీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుంటుందని చెప్పారు. అందుకోసం సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వసతులను ఉపయోగించి పంటల వారీగా లెక్కలు తీసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల బీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజానాన్ని యూనివర్సిటీ అందించాలని సూచించారు. వివిధ సాంకేతిక సంస్థలతో ఇంతకు ముందు జరిపిన సంప్రదింపుల తరహాలోనే ఇప్పుడు స్విట్జర్లాండ్ సంస్థ భాగస్వామ్యంతో చేసిన ప్రయోగాల తీరును మంత్రికి వివరించారు. వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలుందని చెప్పారు. ఆ దిశగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేపట్టాలంటూ వైఎస్ చాన్సలర్‌కు సూచించారు. సమావేశంలో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ డాక్టర్ సమీరేండు మోహంతి, శాస్త్రవేత్త డాక్టర్ టీఎల్ నీలిమ, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎం. బలరాం, డిజిటల్ అగ్రికల్చర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి. బాలాజీ నాయక్ తదితరులు ఉన్నారు.
పంటల నమోదులో ఎస్‌ఏఆర్ డాటా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES