నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఈ నెల జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిల్లీలోని ప్రతిష్టాత్మక పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం ఆలేరు మండలం శారాజీపేట గ్రామ యువతకు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో తెలంగాణ సంప్రదాయ డప్పు నృత్యాన్ని ప్రదర్శించేందుకు శారాజీపేటకు చెందిన యువ కళాకారులు డిల్లీకి బయలుదేరారు. దేశ రాజధానిలో తెలంగాణ గిరిజన, ప్రజా కళల సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పాలనే లక్ష్యంతో యువత ఉత్సాహంగా అహర్నిశలు సాధన చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి శ్రమిస్తున్నారు.
ఈ ప్రదర్శనలో మ్యూజిక్ అకాడమీకి చెందిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అంగడి భాస్కర్ (అందే) కీలకంగా పాల్గొనడం విశేషం. ఈ బృందంలో కంతి దిలీప్, కంతి విక్రమ్, కె.సందీప్, కె.ప్రశాంత్, కందుల నాగరాజు, గ్యాదపాక అజయ్, పంగ విజయ్, గ్యాదపాక ఫణిందర్, గ్యాదపాక దినేష్, చంద్రశేఖర్, నరసింహ, రవితేజ, ఆనంద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన డప్పు కళాకారులు పాల్గొననున్నారు.



