Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసరస్వతీ అపహరణం

సరస్వతీ అపహరణం

- Advertisement -

అది సత్యలోకం! బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని సరస్వతి దేవి వీణ వాదామృతాన్ని గ్రోలుతున్నాడు. సృష్టి కార్యక్రమం ముగిసింది. కావున బ్రహ్మకు విశ్రాంతి. బ్రహ్మ దేవుడు నిద్రిస్తే ప్రళయం వచ్చి సృష్టి అంతా వినాశనమవుతుంది.
విశ్రాంతిగా వీణానాదం వింటున్నాడు. ఎంతసేపైందో తెలియదు. ఆకస్మికంగా వీణానాదం ఆగిపోయింది. బ్రహ్మ కోపంగా కళ్ళు తెరిచి చూశాడు. సరస్వతి లేదు. కాసేపయ్యింది! ఐనా సరస్వతి దేవి జాడలేదు. తన దివ్యదృష్టితో ఏడేడు పధ్నాలుగు లోకాలు గావించాడు. (అదే స్కాన్‌ చేశాడు). అయినా ఎక్కడా కనబడలేదు. ఇంతలో నారధుడు వచ్చాడు.
‘తండ్రీ.. నా మాతృమూర్తి ఎక్కడీ’ బ్రహ్మను ప్రశ్నించాడు నారధుడు.
”నారధుడికి జవాబు చెప్పలేక తలదించుకున్నాడు బ్రహ్మదేవుడు.
”తండ్రీ, నా ప్రశ్నకు బదులివ్వండి! నా మాతృమూర్తి కనబడటంలేదన్న నా ప్రశ్నకు సమాధానం తలదించుకుంటున్నారంటే, మీరే నా తల్లిని ఏదో అన్నారు! అందుకే తను కనబడటంలేదు. మీ త్రిమూర్తులు ఎప్పుడూ ఇంతే! మీరు మారరా?” కోపంతో అన్నాడు నారధుడు.
”శాంతించు నారధా! నీ మాతృమూర్తిని నేనొక్క మాటైనను అనలేదు! ఆకస్మికంగా అదృశ్యమైపోయినది. ఏడేడు పధ్నాలుగు లోకములు గాలించితిని. ఎచ్చటనూ మీ తల్లి జాడ కన్పించలేదు” అన్నాడు బ్రహ్మదేవుడు శోకతప్తుడై.
”ఆఁ.. ఎంతపని జరిగినది? భరత ఖండమున మా తల్లిగారి విగ్రహములు ఆకస్మికంగా మాయమైపోయినవని తెలుసుకొని, ఇక్కడికి వచ్చితిని. కాని ఇక్కడే కాదు, ఎక్కడా లేదని మీరు చెబుతున్నారు. మా తల్లిగారికేమయ్యింది!” అన్నాడు నారధుడు దుఃఖిస్తూ.
బ్రహ్మ పూర్తిగా వివశుడైపోయాడు. ఏమి చేయాలో ఆయనకు తోచటంలేదు. కాసేపటికి నారధుడు తేరుకున్నాడు.
”తండ్రీ మనం వైకుంఠమునకు పోవుదము. ఆ శ్రీమన్నారాయణుడే ఈ సృష్టి రహస్యమును కనుగొనగలవాడు” అంటూ నారధుడు బ్రహ్మ దేవుడిని తీసుకుని వైకుంఠమునకు చేరుకున్నాడు.
యథావిధిగా శ్రీహరి యోగ నిద్రలో ఉన్నాడు. లక్ష్మీదేవి కూడా యథావిధిగానే ఆయన పాదములు ఒత్తుతున్నది.
నారధుడు, బ్రహ్మ చేసిన స్తోత్రాలకు విష్ణుమూర్తి కళ్ళు తెరిచి చూశాడు.
నారధుడు విషయము వివరించాడు.
శ్రీహరి తన మనోనేత్రంతో వీక్షించాడు. ఆయన స్థితి కారకుడు ఆ జగన్నాటక సూత్రధారికి తెలియనిదేమున్నది?
”నాయనలారా సరస్వతిని బంధించి ఉంచినారు. అందుకే తను ఎక్కడా కనబడకుండా పోయింది. ఆమెను బంధించగానే సత్యలోకం నుండి తను అదృశ్యమైపోయింది! సరస్వతి బందీగా ఉన్నంతకాలం మీకేకాదు! మరెవ్వరికీ కనబడదు!” అన్నాడు శ్రీహరి.
ఆ మాటలు వినగానే నారధుడితోపాటు శ్రీ మహాలక్ష్మి కూడా బ్రహ్మదేవుడి వైపు కోపంగా చూశారు.
పాపం బ్రహ్మదేవుడు బక్కచచ్చిపోయాడు. సరస్వతి దేవిని తానే బంధించమని ఏర్పాట్లు చేసినట్లుగా అన్పించాయి వారి చూపులు.
”ఏ రాక్షసుడికీ, వాడి తపస్సును మెచ్చి మీరు వరాలు ఇచ్చి ఉండవచ్చు. ఆ నరబలంతో వాడు సరస్వతిని బంధించియుండవచ్చు గదా!” అన్నది లక్ష్మీదేవి కోపంగా.
”కోపం అందుకున్న మాట అని మనసులో అనుకున్నాడు బ్రహ్మదేవుడు. కాస్త నిదానంగా ఆలోచించాడు. ఇది కలియుగం ఈ యుగంలో రాక్షసులెవరూ తపస్సు చేయలేదు. ఎవరికీ వరాలు ఇవ్వలేదు. తన దివ్యదృష్టికి కూడా కనబడనంత శక్తివంతమైన రాక్షసులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చును. మహాశివుడు మాత్రమే అంతటి వరాలు ఇవ్వగలడు అనుకున్నాడు.
”తండ్రీ! నేను ఏ రాక్షసుడికీ వరములు ఇవ్వలేదు. నా దివ్యదృష్టికి కూడా దృగ్గోచరం కానంత శక్తిగల వరములు ఇవ్వగలవాడు ఆ మహాశివుడే. ఆయనే ఇచ్చిన వరబలంతోనే ఏ రాక్షసుడో సరస్వతిని బంధించి యుండవచ్చును” అన్నాడు బ్రహ్మదేవుడు.
ఇంతలో మహాశివుడు ప్రత్యక్షమయ్యాడు.
”ఏమది? సరస్వతి కనబడుట లేదట! ఏమి జరిగినది?” అని ప్రశ్నించాడు మహాశివుడు.
”మా తల్లిని ఎవరో రాక్షసుడు బంధించినాడట! వాడెవడో అతి గొప్ప వరబలం గలవాడై ఉంటాడని, అట్టి వరబలం తమరే ప్రసాదించి యుండవచ్చునని, మా తండ్రిగారికి ధర్మసందేహం కలిగింది!” అన్నాడు నారధుడు.
మహాశివుడు పెద్దగా నవ్వాడు.
”గత కొంతకాలంగా నేను ధ్యానంలోనే ఉన్నాను. అందువల్ల నేను ఏ రాక్షసుడికీ ఎలాంటి వరాలు ఇవ్వలేదు! ఐనా ఇది కలియుగం కదా! ఇప్పుడు రాక్షసులెక్కడున్నారు? అంతా మానవులే కదా!” అన్నాడు శివుడు.
”జగన్నాటక సూత్రధారీ! నీవు మరోమారు మత్స్యావతారం దాల్చవలసిన తరుణం ఆసన్నమైనది! ఈ మన్వంతరం ప్రారంభమైన తొలినాళ్ళలో నా నోట్లోని వేదాలను హాయగ్రీవుడనే రాక్షసుడు దొంగిలించినపుడు నీవు మత్స్యావతారుడవై, ఆ హాయగ్రీవుడిని సంహరించి వేదములను కాపాడి లోకోద్ధరణ చేసితివి. ఇపుడు సరస్వతిని బంధించినారు! సరస్వతి అనగా జ్ఞానము! జ్ఞానమును బంధించుటకు సాహసించిన వారెంతటి మూర్ఖులు? వారిని దునుమాడి లోకాలకు జ్ఞానబిక్ష పెట్టుము దేవా!” అన్నాడు బ్రహ్మదేవుడు చేతులు జోడించి.
శ్రీహరి చిరునవ్వు నవ్వాడు.
”బ్రహ్మదేవా! శాంతించు! సరస్వతి అనగా జ్ఞానమును బంధించినారని తెలియగానే నీ జ్ఞానము పని చేయుట మానివేసినట్లున్నది! ఇంతకుముందు మీరిద్దరూ చెప్పినట్లే ఇది కలికాలము. ఇట్టి కలియుగమునందు రాక్షసులు వేరుగా ఉండరు. కలి పురుషుడి మాయచేత మానవులే రాక్షస ప్రవృత్తి కలిగి యుందురు. అట్టి రాముడు ప్రవృత్తి గలవారే సరస్వతిని బంధించినారు!” అని శ్రీహరి వివరిస్తూ ఉండగానే నారధుడు అడ్డుతగిలాడు.
”దేవా! ఎంతటి రాక్షస ప్రవృత్తిగల వారైనా మానవులే కదా! వారు ఇంతటి శక్తివంతులు ఎలా అయ్యారు! వారెందకు సరస్వతీ మాతను బంధించినారు! ఇంతకూ ఎక్కడ బంధించినారు?” ప్రశ్నించాడు నారధుడు.
మీరు ఈ యుగధర్మమును విస్మరించుచున్నారు. కలియుగములో పాలకులు అత్యంత శక్తిమంతులు. సరిగ్గా చెప్పాలంటే రాక్షసుల శక్తులను మించినవి వారి శక్తులు. ప్రజాస్వామ్యమే కలియుగ ధర్మం. అట్టి ప్రజాస్వామ్య పద్దతుల ద్వారా అదికారములోకి వచ్చిన మానవులు పాలకులై కలి పురుషుడి మాయలో చిక్కుకుని రాక్షసులను మించిన దుష్టత్వం, క్రూరత్వమును కలిగియుండురు. రాక్షస పాలనను మించిన దుష్టత్వముతో వీరి పరిపాలన యుండును. ప్రజలు అజ్ఞానులై అంధకారములో జీవించినంతకాలము వీరి ఆగడాలు కొనసాగుతాయి! అందుకే ప్రజలకు జ్ఞానము అందకుండా విశ్వ ప్రయత్నాలు చేయుదురు. అందులో భాగంగానే జ్ఞానానికి ప్రతిరూపములైన పుస్తకములను నిషేధింతురు. జ్ఞాన దీపములను వెలిగించెడి రచయితలను, మేధావులను పాలకులు మట్టు బెట్టుచుందురు. గత దశాబ్దకాలముగా ఈ ధోరణి కొనసాగుచున్నది. ఈ కలియుగము నందు మన అవతారములు పనిఏయవు. కావును మరోమారు అవతారము దాల్చుట దుర్లభము” అన్నాడు శ్రీహరి.
సంభవామి యుగే, యుగే అని సెలవిచ్చిన మీరు, ఇప్పుడు ఇలా మాట్లాడిన సరస్వతి దేవి అనబడు జ్ఞానము ప్రజలకు అందకుండా పోవలసిందేనా?” దీనంగా అన్నాడు నారధుడు.
”నారధా! మరొక్కమారు వినుము! ప్రజాస్వామ్యమే ఈ యుగదర్మము. అదే ఈ ప్రజల చేతిలోని శక్తివంతమైన ఆయుధం కూడా. అట్టి ఆయుధమును ఉపయోగించుకుని, జ్ఞానాన్ని అందుకునుటకై కలి పురుషుని విషకౌగిలిలో ఉన్న పాలకులపై పోరాడాలి. సన్మార్గులను పాలకులుగా ఎన్నుకోవలసి ఉన్నది! అంతకు మించి మరో మార్గము లేదు!” అంటూ శ్రీహరి యోగ నిద్రలోకి జారుకున్నాడు.
– ఉషాకిరణ్‌

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad