కృష్ణా, గోదావరి జలాలపై అసెంబ్లీలో కీలక చర్చ
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకపై ఉత్కంఠ
సభకు హాజరుకావాలంటున్న అధికార పక్షం
సర్కారు నిర్లక్ష్యంపై నిలదీతకు ప్రతిపక్షం సిద్ధం
విపక్షాల ప్రశ్నలకు గట్టి సమాధానమివ్వనున్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) రాకపై ఉత్కంఠ నెలకొంది. గతనెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఆయన హాజరయ్యారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. సభలో కేవలం ఏడు నిమిషాలు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై సంతకం పెట్టకుంటే అనర్హత వేటు పడుతుందనీ, జీతం రాదు కాబట్టే వచ్చి వెళ్లారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే గతనెల 21న బీఆర్‌ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. అనంతరం కేసీఆర్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణకు, ప్రజలకు ఎంత నష్టం కలుగుతుందో వివరించారు.
బీఆర్‌ఎస్ హయాంలో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90శాతం పనులు పూర్తి చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి ఖర్చు చేయలేదనీ, తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. పైగా ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుడతామనీ, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో అసెంబ్లీ వస్తే అన్ని విషయాలనూ చర్చిద్దామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. అనుకున్నట్టుగానే గతనెల 29న మొదటి రోజు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు. అయితే శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాలపై కీలక చర్చ జరగనుంది. కేసీఆర్ ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే సమాధానం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్ హాజరవుతారా? లేదా?అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.
హాజరు డౌటే ! అందుకే ఉపనేతల నియామకం
బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేతలుగా మాజీమంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కేసీఆర్ నియమించారు. శాసనమండలిలోనూ ఉపనేతలుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేతల నియామకంతో కేసీఆర్ సభకు వచ్చేది అనుమానమేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఆయన ఫాంహౌజ్‌లోనే ఉన్నారు. ఒకవేళ అసెంబ్లీకి హాజరు కావాలనుకుంటే గురువారం సాయంత్రం నాటికి నందినగర్‌లోని నివాసానికి చేరుకోవాలి. కానీ ఇప్పటి వరకు చేరుకోలేదు. దీంతో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలని భావిస్తున్నది. ఈ దిశగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వంతో రాజీపడడం, మోడీకి, చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి భయపడి నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలను సభలో నిలదీసేందుకు సిద్ధమవుతున్నది. ఏపీ జలదోపిడీతో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు మరోసారి వివరించనుంది. అయితే కృష్ణా, గోదావరి జలాల విషయంలో బీఆర్‌ఎస్ హయాంలో చేసిన తప్పులను ఎత్తిచూపేందుకు అధికార పక్షం సిద్ధమవుతున్నది. విపక్షాల ప్రశ్నలకు ధీటైన సమాధానాలు ఇచ్చేందుకు మంత్రులు రెడీగా ఉన్నారు. గురువారం ప్రజాభవన్‌లో నదీజలాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణకు ఎలా నష్టం కలిగిందో చెప్పారు. ఇదే విషయాలను అసెంబ్లీలోనూ అధికార పక్షం బలంగా వినిపించనుంది. కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ కోరుతున్నది. ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలివ్వాలని సూచిస్తున్నది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.



