నవతెలంగాణ- బీర్కూర్ (నసురుల్లాబాద్)
ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్ కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్ లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇందులో భాగంగా బీర్కూర్ గ్రామ సర్పంచ్ ధర్మతేజ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు. మంగళవారం బీర్కూర్ పంచాయతీ పరిధిలో గల ప్రకాష్ రావు క్యాంపు నుండి తెలంగాణ తిరుమల దేవస్థానం వరకు సుమారు 60 లక్షల హెచ్ డి ఎఫ్ నిధులతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు స్థానిక సర్పంచ్ కు స్థానిక అధికారులు సమాచారం ఇవ్వలేదు.
ఎమ్మెల్యే పోచారం అలాగే ఇతర గ్రామ సర్పంచ్ లతో కొబ్బరికాయలు కొట్టి రోడ్డు పనులను ప్రారంభించారు. మండల పరిధి అధికారులు వారి బాధ్యత మరచి ఇతర గ్రామ సర్పంచులకు ఎలా అనుమతి ఇస్తారు. ప్రోటోకాల్ పాటించాల్సిన అధికారులు కొందరికి తొత్తులుగా మరినారని ఆరోపిస్తున్నారు . స్థానిక సర్పంచ్ లకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. బీర్కూర్ గ్రామంలో అభివృద్ధి నిధులతో చేపట్టే పనులకు ప్రోటోకాల్ పాటించే విధంగా అధికారి చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో సబ్ కలెక్టర్ కు తెలియజేయడం జరిగిందన్నారు. అభివృద్ధికి అడ్డు తగలకూడదని ఉద్దేశంతో తాను అధికార పార్టీ నాయకులు ప్రశ్నించడం లేదని, దీనినే ఆసరాగా తీసుకొని ఒక గ్రామ ప్రధమ పౌరుడైన తనను చిన్నచూపు చూస్తే ఇకనుంచి సహించేదిలేదన్నారు.
ఎన్నికలు ఉన్నంతవరకే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలని పక్కనపెట్టి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయవలసి ఉండగా, ఉద్దేశపూర్వకంగా తనపై కక్ష సాధింపు చర్యలు పాటిస్తే సహించేది లేదన్నారు. తెలంగాణ తిరుమల దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు కూడా తనకు ఆహ్వానం అందించలేదని ధర్మతేజ ఆరోపించారు. ఇకనుంచి తన గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలకు గ్రామ సర్పంచుకు ఆహ్వానం ఇవ్వకపోతే అధికారులపై చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ప్రోటోకాల్ పాటించాలని లేని యెడల నిరసన కార్యక్రమాలు ఉంటాయని, ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకుంటామని ధర్మతేజ ఈ సందర్భంగా హెచ్చరించారు.


