Tuesday, November 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడ్రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌

మూడ్రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌

- Advertisement -

– ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తాం
– అభివృద్ధికి సహకరించే వాళ్ళనే ఎన్నుకోండి
– కొడంగల్‌ను నోయిడాగా తీర్చిదిద్దడమే లక్ష్యం
– ఆడబిడ్డల సంతోషం కోసమే సంక్షేమ పథకాలు అమలు
– లగచర్ల పారిశ్రామికవాడకు అంతర్జాతీయ గుర్తింపు : కొడంగల్‌ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి
– రూ.103 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
– హరే కృష్ణ ఫౌండేషన్‌ మిడ్‌ డే మీల్స్‌ కిచెన్‌ షెడ్‌కు భూమి పూజ

ప్రభుత్వం విద్య, ఇరిగేషన్‌ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నది. దానికి కొడంగల్‌ను ప్రయోగశాలగా ఎంచుకున్నాం. విద్యారంగంలో దేశానికి నోయిడా ఎలానో, తెలంగాణకు కొడంగల్‌ను కూడా అలా తీర్చిదిద్ది, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తా. నియోజకవర్గానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి చదువుకునే విధంగా మారుస్తాం. – సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-కొడంగల్‌
సర్పంచ్‌ ఎన్నికలకు రెండు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్‌ వస్తుందనే సమాచారం ఉన్నదని సీఎం ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. గ్రామాల్లో బడి, గుడి, తాగడానికి మంచినీరు, ఇందిరమ్మ ఇండ్లు సహా స్థానిక సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కరించేవారినే సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి నిరోధకులను ఎన్నికల్లో ఓడించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమైందని చెప్పారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికి కూడా సర్పంచ్‌లే కీలకమనీ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారే వారధులుగా నిలుస్తారని తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గాన్ని 2034 నాటికి పర్యటక కేంద్రంగా మార్చుకుందామన్నారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరితో కలిసి సీఎం పర్యటించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో రూ.103 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడబిడ్డలు సంతోషంగా, ప్రశాంతంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆ విశ్వాసంతోనే వారిని ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం విద్య, ఇరిగేషన్‌ రంగాలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నదనీ, దానికి కొడంగల్‌ను ప్రయోగశాలగా ఎంచుకున్నామని తెలిపారు. విద్యారంగంలో దేశానికి నోయిడా ఎలానో, తెలంగాణకు కొడంగల్‌ను కూడా అలా తీర్చిదిద్ది, ఎడ్యుకేషన్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

నియోజవర్గానికి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి చదువుకునే విధంగా మారుస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనీ, కోటి మంది ఆడపడుచులకు ప్రభుత్వ కానుకగా చీరలు అందజేస్తున్నామన్నారు. మహిళలు పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేసుకోవడం, ఆర్టీసీలో అద్దె బస్సులు నడిపించే విధంగా వెయ్యి మంది మహిళలను ప్రోత్సహించామని తెలిపారు. కొడంగల్‌ నియోజకవర్గాన్ని పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి చెందే దిశగా కృషి చేస్తున్నామనీ, పాఠశాల విద్యార్థులు ఆకలితో కడుపు మాడ్చుకోవద్దనే ఉద్దేశంతో అక్షయపాత్ర వాళ్లతో మాట్లాడి నియోజకవర్గంలో దాదాపు 312 పాఠశాలల్లో 28 వేలమంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కొడంగల్‌కు మెడికల్‌ కళాశాల, వెటర్నరీ కళాశాల, పారామెడికల్‌ కళాశాల, ఫిజియోథెరపీ, ఇంజనీరింగ్‌ కళాశాల, ఐటీఐ, జూనియర్‌, డిగ్రీ, సైనిక్‌స్కూల్‌ను తీసుకొచ్చామన్నారు. కొడంగల్‌- నారాయణపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ప్రారంభిస్తున్నామనీ, రేపటి మంత్రివర్గంలో ఆమోదం పొందగానే మూడు నెలల కాలంలో పనులు ముమ్మరంగా కొనసాగుతాయన్నారు. లగచర్లకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకువచ్చి లగచర్ల పారిశ్రామిక వాడను ప్రారంభించుకుంటామని చెప్పారు.

పారిశ్రామికాభివృద్ధి జరగాలంటే రైలు రావాలని, వికారాబాద్‌-కృష్ణా రైల్వే లైన్‌ తీసుకువచ్చి త్వరలోనే కొడంగల్‌లో రైలు కూత వినిపించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులతో కలసి రూ.5.83 కోట్లతో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రూ. 5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ. 3 కోట్లతో 10 గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, రూ. 3.65 కోట్లతో బంజారా భవన్‌ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్‌ వాల్‌, డైనింగ్‌ హాల్‌, నీటి సరఫరా, విద్యుదీకరణ), రూ.కోటితో కొడంగల్‌లో ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన, రూ. 1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం.రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్‌ షెడ్లు కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణం, రూ. 4.45 కోట్లతో సీసీరోడ్లు, భూగర్భ డ్రయినేజీల నిర్మాణం, రూ. 2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాల ప్రారంభం, రూ.60 కోట్లతో కొడంగల్‌ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ. 5 కోట్లతో గెస్ట్‌ హౌస్‌ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్న హరే కృష్ణ ఫౌండేషన్‌ కిచెన్‌ షెడ్‌కు భూమి పూజ చేశారు.

లబ్దిదారులకు చెక్కుల పంపిణీ
మైనార్టీ శాఖ ద్వారా వికారాబాద్‌, నారాయణపేట జిల్లాలోని 625 మంది లబ్దిదారులకు పౌల్ట్రీ, గొర్రెల ఫామ్‌ ఏర్పాటు నిమిత్తం ఆర్థిక సాయం చెక్కులను ముఖ్యమంత్రి అందజేశారు. మహిళాశక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడపనున్న ఆర్టీసీ బస్సును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు రూ.300 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును సీఎం అందజేశారు. కార్యక్రమంలో పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మెన్‌ గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బి.మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్లు రాజేశ్వర్‌రెడ్డి, విజయకుమార్‌, వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, నారాయణపేట కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌, వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్‌, సుధీర్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అక్షయ పాత్ర ఫౌండేషన్‌ చైర్మెన్‌ సత్యగౌడ, చంద్రప్రభుదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -