Sunday, October 19, 2025
E-PAPER
Homeమానవిసర్పంచ్‌ పుల్లమ్మ

సర్పంచ్‌ పుల్లమ్మ

- Advertisement -

అత్యంత చిన్న వయసులోనే పెండ్లి చేశారు. ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టారు. పుస్తకాలపై ఉన్న ఇష్టంతో ఇంటెడు పనులు చేస్తూనే క్రమం తప్పకుండా చదివేవారు. ఆమె చదవడమే కాకుండా నలుగురితో చదివించేవారు. పఠనాసక్తిని తన పిల్లల్లో కూడా కలిగించారు. ఎంతో ప్రోత్సహించి పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేశారు. గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తల్లో నాలికలా మెలిగేవారు. ప్రజల అభిమానాన్ని పొంది సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఇలా కుటుంబానికే కాక గ్రామన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించారు. తల్లులు రాజకీయాల్లోకి వస్తే ఎలాంటి మార్పు తీసుకురాగలరో నిరూపించారు. ఆమే సర్పంచ్‌ పుల్లమ్మ.

నంద్యాల జిల్లా, దొర్ని పాడులో 1950లో పుట్టిన యం.పుల్లమ్మ ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ పుస్తకాలంటే చాలా ఇష్టం. దాంతో ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ, తన చుట్టుపక్కల వారితో కూడా వాటిని చదివి వినిపించేవారు. పదిహేనేండ్ల వయసులో నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడ మండలం, ఇంజేడు గ్రామానికి చెందిన మారంరెడ్డి నాగిరెడ్డి, లక్ష్మమ్మల చిన్న కొడుకు లక్ష్మిరెడ్డితో ఆమె పెండ్లి జరిగింది. ఉమ్మడి కుటుంబంలో అందరితో కలిసి మెలసి ఉండేవారు. ఇంటి పనులతో పాటు చేలలో కూడా పనులు చేసేది.

కొడుకు చికిత్స కోసం…
పుల్లమ్మకు 1968లో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవానికి ఏడాది వయసు ఉన్నప్పుడు చికెన్‌ ఫాక్స్‌ పోసి, లివర్‌ సమస్య కారణంగా కాళ్లు, చేతులు సన్నగా, తల లావుగా మారింది. అప్పుడు ఇంటి పెత్తనమంతా మామ గారి చేతిలో ఉండేది. వైద్యులు చూపించమంటే మామగారు పలుకలేదు. తండ్రి మాట కాదని భర్త ఏమీ చేయలేకపోయారు. దాంతో ఆమే మూడు నెలలపాటు కొడుకుకు ఆస్పత్రిలో చికిత్స చేయించింది. 1970లో ఆడబిడ్డ పుట్టింది. 1973లో మరో ఆడబిడ్డ పుట్టింది. కొంత కాలానికి అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నారు. అయితే అత్తమామలు వీరి దగ్గరే ఉండేవారు. 16 ఎకరాల పొలంతో పాటు 20,000 అప్పు ఆస్తి పంపకంలో వచ్చింది. తర్వాత తండ్రి పెత్తనాన్ని కొడుక్కే అప్పజెప్పాడు.

పొలంలో కూలీగా…
మూడేండ్లు భర్తతో కలిసి కూలీలు లేకుండా సొంతంగా పొలంలో కష్టపడి పంట పండించారు. భర్త వ్యవసాయంతో పాటు కాంట్రాక్టు పనులు చేయడం మొదలుపెట్టారు. తర్వాత రెండు ఎద్దులు, ఎద్దులబండి, పాడిపశువులను కొన్నారు. పుల్లమ్మ కూలీలను తీసుకొని పొలానికి వెళ్లి వారితో కలిసి పనిచేసేది. ఇంట్లో అందరికీ వండి పెట్టి, పిల్లలను బడికి సిద్ధం చేసి, పొలానికి వెళ్లి పనిచేసి, గడ్డి కోసుకొని ఇంటికి వచ్చేది. 1977లో మరో ఆడబిడ్డ పుట్టింది. బిడ్డలు ప్రసవించిన సమయంలో రెండు నెలలు పుట్టింట్లో ఉండేవారు. అత్తారింటికి వచ్చాక మళ్లీ ఎప్పటి లాగే పని.

పుస్తకాలను వదల్లేదు
ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కాస్త ఖాళీ సమయం దొరికినా పుస్తకాలు చదివేవారు. ఆమె చదువుతూ పిల్లలకు కూడా కథలు చెబుతూ, చదివిస్తూ ఉండేవారు. కొడుకును డిగ్రీ వరకు చదివించారు. పెద్ద కూతురును, రెండో కూతురును 10 వరకే చదివించి మామ మాట కాదనలేక చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేశారు. తర్వాత కొడుక్కు కూడా పెండ్లి చేసి, వ్యవసాయ పనులు అప్పగించారు. చిన్న కూతురు నాగేశ్వరమ్మకు చదువు పట్ల ఆసక్తి ఉండడంతో డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్స్‌ కొరకు కోచింగ్‌కు పంపించారు. ఆమెకూ తర్వాత పెండ్లి చేసినప్పటికీ చదువుకు అండగా నిలబడి, ఎం.ఎ., టి.పి.టి (తెలుగు పండిత శిక్షణ) పూర్తి చేయించి, డి.యస్సీలో ఉద్యోగం పొందడానికి కారణమయ్యారు. ఒకపక్క అత్తమామలను చూసుకుంటూనే మనుమలు, మనవరాళ్లను కూడా పెంచారు.

గ్రామ ప్రజల అభిమానంతో…
పుల్లమ్మ ఇంట్లోనే కాదు ఇరుగు పొరుగు వారితో కూడా ఎంతో కలివిడిగా ఉండేవారు. అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ, అవసరమైన వారికి ఆర్థిక సహాయం కూడా అందించేవారు. ఆమెలోని ఈ సుగుణాలతో ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. 2001లో ఓ.సి. మహిళకు సర్పంచ్‌ పదవి కేటాయించడంతో విద్యావంతురాలు, సహాయగుణం కలిగిన పుల్లమ్మను ఎంతో నమ్మకంతో ఆ ఊరి ప్రజలంతా కలిసి ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు.

సర్పంచ్‌గా ఆమె…
పదవీకాలంలో ఆమె గ్రామంలో సిమెంట్‌ రోడ్లను వేయించారు. మురుగునీటి కాల్వలు నిర్మించారు, ఇంటింటికి మంచినీటి నల్లాలు ఏర్పాటు చేశారు. క్రమం తప్పకుండా గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేశారు. వీథి లైట్ల ఏర్పాటు, వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించడం, స్వచ్ఛత కార్యక్రమాలు, మొక్కలు నాటించడం వంటి ఎన్నో కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించారు. ఇలాంటి తల్లులతోనే గ్రామాభివృద్ధి, ఇటు కుటుంబంలో అటు సమాజంలో సుఖశాంతులు, సంతోషాలు వెల్లివిరుస్తాయి

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -