స్వాగతం పలుకుతున్న సమస్యలు
పెండింగ్‌లో రూ.వెయ్యి కోట్ల బిల్లులు
హరితహారం..ఆర్థికభారం
నిధుల కోసం కేంద్రం, రాష్ట్రాలవైపు చూపులు
గ్రామపాలన..ఎన్నికైనంత సులువుకాదు
అప్పులపాలైన గత సర్పంచ్‌లు
బిల్లుల కోసం ఇప్పటికీ ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లకు గ్రామాలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏడాదిన్నరగా కేంద్రం నుంచి నయా పైసా రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగి పోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్రామాలకు నిధులు కేటాయించ లేదు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు తోడు హరితహారం, స్మశాన వాటికల నిర్మాణం వంటి కొన్ని పనులను విధిగా చేయాలని అధికారులు పాత సర్పంచ్‌లపై ఒత్తిడి చేశారు. దీనితో అనేక గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శులు సొంత డబ్బులు, అప్పులు తెచ్చి ఆ పనుల్ని పూర్తిచేశారు. వాటికి సంబంధించి దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధిపై దృష్టి పెట్టాలా లేక పాత సర్పంచ్‌లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, కార్యదర్శులు చేసిన అప్పులను సమన్వయం చేసుకోవాలో తేల్చుకోవాల్సిన పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఉన్నాయి.
నేడు బాధ్యతల స్వీకరణ
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 12,702 గ్రామాలకు చెందిన కొత్త సర్పంచ్‌లు సోమవారం పదవి బాధ్యత లు చేపట్టనున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శు లు వీరితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎన్నికల్లో ఢక్కాము క్కీలు తిని అధికారం దక్కించుకున్న వారికి నిధుల స్థానంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత సర్పంచులు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, శ్మశానవాటికల నిర్మాణాలకోసం లక్షలు ఖర్చు చేశారు. ప్రత్యేక నిధులు రాకపోయినా అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశారు. ఒక్కో మాజీ సర్పంచ్, కార్యదర్శులకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంది.
గుదిబండగా 2018 చట్టం
2018 పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్‌లకు గుదిబండగా మారనుంది. గ్రామంలో పన్నులు వసూలు కాకపోయినా సర్పంచ్‌నే బాధ్యుణ్ని చేస్తున్నారు. ఈ చట్టం వారికి అధికారాలు ఇవ్వకుండా, బాధ్యతలనే ఇచ్చింది. కొన్ని బాధ్యతలు నిర్వర్తించని సర్పంచ్‌లను పదవుల నుంచి సస్పెండ్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టారు. గతంలో కూడా సస్పెన్షన్ ఉండేది. కానీ, ఇప్పుడు కారణాలు పెరిగాయి. ఈ చట్టం ఆ బాధ్యతల గురించి చెప్పింది తప్ప, ఆ బాధ్యతలు పూర్తి చేయడానికి అధికారం, డబ్బు ఎలా వస్తాయనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఇప్పటి వరకూ తెలంగాణలో 47 మంది సర్పంచ్‌ల సస్పెండ్ అయ్యారు. 200 మంది ఓటర్లు, 300 జనాభా ఉన్న పల్లెలను కూడా పంచాయితీలు చేశారు. ఆ పంచాయితీ ఏడాది మొత్తం ఆదాయం కలిపినా రానంత డబ్బును, ఆ పంచాయితీ అభివృద్ధి కోసం సర్పంచ్ ఎక్కడి నుంచి తెస్తాడు? వీధి దీపాల కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేని పంచాయితీలు, లక్షల రూపాయలు పెట్టి స్థలాలు కొనలేవు. ఈ కొత్త నిబంధనల వల్ల కొత్తగా సర్పంచ్‌లుగా ఎన్నికై, ఆర్థికంగా బలం లేని దళితులు, పేదలు, మహిళా సర్పంచ్‌లే ఇబ్బంది పడతారనే అంచనాలు ఉన్నాయి.
భారంగా హరితహారం
హరిత హారం కార్యక్రమం కింద స్థలాలు వెతకడం, మొక్కలు పెంచడం కొత్త సర్పంచ్‌ల బాధ్యత. ఇదే ఇప్పుడు వారికి భారంగా మారుతోంది. ఈ పథకం కింద నాటిన మొక్కల్లో 85 శాతం బతక్క పోతే, దానికి సర్పంచ్‌లనే బాధ్యుల్ని చేస్తారు. నెల రోజుల్లో శ్మశాన వాటిక లేదా డంపింగ్ యార్డ్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఆర్డర్లు వేస్తారు. వాటికి సంబంధించిన నిధులు ఇవ్వరు. స్థలాలు గుర్తించరు. స్వయంగా సర్పంచ్, కార్యదర్శి వాటిని గుర్తించి చేపట్టాలి. గ్రామానికి చెందిన ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయో రెవెన్యూ విభాగం చెప్పదు. గత సర్పంచ్‌లను ఈ మూడు పథకాలు అప్పుల పాలు చేశాయి.
నేడు కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ..ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి
పాతబకాయలు తీర్చడానికే మాకు రెండేండ్లు పడుతుంది. ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వకపోతే గ్రామపంచాయతీల నిర్వహణ కష్టమే. పంచాయతీ కార్యదర్శులకు, మాజీ సర్పంచుల బిల్లుల కోసం రూ.10 లక్షలు కావాలి. కేంద్ర, రాష్ట్ర నిధులతోపాటు రూ.10 లక్షల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలి. -వామన్‌గౌడ్, సర్పంచ్, నడిగడ్డ, నాగర్ కర్నూల్ జిల్లా



