కుక్కల కోతుల బెడద నివారణకు అధిక ప్రాధాన్యత
సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండ
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి కుక్కల నివారణ చర్యలను శుక్రవారం ప్రారంభించారు. కుక్కలను చంపకుండా వాటిని నివారించేందుకు బోనకల్ గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ బానోతు కొండ గురువారం కుక్కల బెడద పై నియంత్రణ చర్యలు చేపట్టారు. గ్రామంలో ప్రజలకు, చదువుకునే పిల్లలకు కుక్కల బెడద నుంచి ఎటువంటి ప్రమాదం, ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా కుక్కలను పట్టే స్పెషలిస్టులను పిలిపించారు. గ్రామంలో విధులు వెంట ఉన్న కుక్కలను పట్టుకొని జనసంచారం లేని సురక్షిత అడవి ప్రాంతంలో విడిచి పెడుతున్నారు.
ఖర్చు ఎక్కువైనా కుక్కల నివారణకు చర్యలు చేపడుతున్న సర్పంచ్, ఉప సర్పంచ్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ బానోతు కొండ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ముందుగా గ్రామంలో కోతులు, కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే కుక్కల నివారణ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా కుక్కల బెడద తీవ్రంగా ఉందని గ్రామ ప్రజల నుంచి తమకు ఎక్కువగా ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజల శ్రేయస్సు కోసం త్వరితగతిన కుక్కల బెడద నుంచి నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు.
ముందు ముందు గ్రామంలో కోతులు, కుక్కల బెడద లేకుండా పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపడతామని, దీనికి గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ వారికి సహకరించాలని కోరారు.గ్రామ ప్రజలు సహకారం ఉంటే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడతామని వారు కోరారు. కుక్కలను నేర్పుగా పట్టుకునే స్పెషలిస్టులకు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు సహకరించారు.



