ఓటేస్తామంటున్న పల్లె ఓటర్లు..
గ్రామాల్లో శునకాలు, వానరాల బెడద తీవ్రం
నిత్యం ప్రజలపై దాడులు
పంటల చేలను నాశనం చేస్తున్న వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు
సాధారణంగా ఎన్నికలు వస్తే రోడ్లు. డ్రెయినేజీలు, ఇళ్లు లేవని, పింఛన్లు రాలేదని పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లు డిమాండ్ చేస్తుంటారు. అభ్యర్థులు కూడా వాటిపైనే హామీలిస్తుంటారు. కానీ ఈసారి పరిస్థితి మారింది.స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో కోతులు, కుక్కల నివారణే ప్రధాన ఏజెండాగా మారనుంది. పదేళ్లుగా గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతోంది. అదేస్థాయిలో కుక్కలు కూడా పెరిగిపోయాయి.మండలంలో నిత్యం తాడిచెర్ల, పెద్దతూండ్ల, మల్లారం, కొయ్యుర్, వళ్లెంకుంట తదితర గ్రామాల్లో కోతులు, కుక్కల దాడుల్లో పలువురు గాయపడుతున్నారు. జనాలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. కోతులు, కుక్కల బెడదను నివారించే అభ్యర్థులకే ఓటేస్తామనే డిమాండ్ ఓటర్ల నుంచి వస్తోంది.
పంట చేలల్లోనూ కిష్కింధకాండ..
అటవీ ప్రాంతంగా పేరున్న భూపాలపల్లి జిల్లాలో పోడు సాగు ప్రభావంతో కోతులు గ్రామాల వైపు మళ్లాయి. పట్టణాల్లో కూడా కోతుల బెడద తీవ్రంగానే ఉంది. ఇళ్లను చిందరవందర చేయటంతోపాటు పిల్లలను, మహిళలను, వృద్ధులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. చేతులలో ఏదైనా కవర్ కనిపిస్తే చాలు ఎగబడి దాడిచేసి లాక్కుపోతున్నాయి. ఇంటి పెరళ్లలో కూరగాయ,పూలమొక్కలు వేసుకునే పరిస్థితులు లేవు. జిల్లాలో రోజూ కనీసం నాలుగైదు చోట్ల కోతుల దాడులలో ప్రజలు గాయపడుతున్నారు. ఇక పంటచేలను కోతుల మందలు నాశనం చేస్తున్నాయి. పత్తి కాయలను కొరికి పడేస్తున్నాయి. వరికంకులను విరిచేస్తున్నాయి. పంటలను కాపాడుకునేందుకు కాపలా మనుషులను పెట్టుకోవాల్సివస్తోంది.
నిత్యం దాడులు..
గ్రామాల్లో కోతులు, వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రక్షణగా చేతిలో కర్ర తెచ్చకోవాల్సి వస్తోంది. పదేళ్లుగా కోతుల, కుక్కల నివారణ చర్యలు చేపట్టడంలేదు. దీంతో కోతుల, కుక్కల దాడిలో పలువురు గాయాలపాలవుతున్నారు. మండలంలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో రోజుకు ఒక కెసైన నమోదువుతుంది. ఈ నేప థ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలు, కోతుల నివారణ చర్యలు తీసు కోవాలని ఏళ్ల తరబడి ప్రజలు డిమాండ్ చేస్తు న్నారు.
అభ్యర్థులు ఎం చెబుతారో…
ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ముమ్మర కన రత్తు చేస్తున్నారు. ఓటర్లు మాత్రం ఈసారి స్థానిక ఎన్నికలలో కోతులు, కుక్కల నివారణ కోసం ఏమి చేస్తారని అభ్యర్ధులను నిలదీసే పరిస్ధితులున్నాయి. కొన్నిచోట్ల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు లిఖిత పూర్వకంగా కోతులను, కుక్కలను తరిమేస్తామనే హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తుగా కోతులు, కుక్కలు తరిమించే చర్యలు చేపట్టిన వారిని ఏకగ్రీవంగా గెలిపిస్తామని ఓటర్లు చర్చించుకుంటున్నారు.