Friday, December 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్పంచ్‌ మీకు.. ఎంపీటీసీ మాకు..

సర్పంచ్‌ మీకు.. ఎంపీటీసీ మాకు..

- Advertisement -

లేదంటే.. వైస్‌ ప్రెసిడెంట్‌- వార్డుల వారీగా ఒడంబడికలు
రిజర్వేషన్లు కలిసి రాని చోట పార్టీలకతీతంగా రహస్య ఒప్పందాలు
ఎన్నికల కోసం ఒక్కటవుతున్న ప్రత్యర్థులు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘ఎట్లాగూ ఈసారి రిజర్వేషన్లు కలిసి రాలేదు.. మనలో మనకు గొడవలెందుకూ? ఒక్కటైతే పోలా..! అన్నా.. ఈ సారి నువ్వు సర్పంచ్‌గా పోటీ చేద్దామనుకున్నవ్‌..గా సంగతి నాకూ తెలుసు.. కానీ ఏం చేస్తాం! రిజర్వేషన్‌ నీకు కలిసి రాకపాయె.. నాక్కూడా అనుకూలంగా వస్తదో రాదో అనుకున్నా కానీ వచ్చింది. అందుకే ఓ విషయం చెబుదామని వచ్చిన.. ఊళ్లె మనం మనం కొట్లాడుకుంటే ఎవరికీ వచ్చేదేం లేదు. ఇద్దరం ఓ అండర్‌ స్టాండింగ్‌కు వద్దాం..’ అని రిజర్వేషన్లు కలసిరాని చోట పార్టీల కతీతంగా ఆశావహులు ఏకతాటి పైకి వస్తున్నారు.

‘సర్పంచ్‌ ఎలక్షన్ల నాకు సపోర్ట్‌ జెరు.. ఎంపీటీసీ ఎలక్షన్ల నిన్ను గెలిపించే బాధ్యత నాది.. నన్ను నమ్ము.. ఈ సంగతి మనిద్దరి మధ్యనే ఉండాలె’ అని ఓ నాయకుడు ప్రపోజల్‌ పెట్టగా.. ‘ఎట్లయినా మా పార్టీ క్యాండిడేట్‌ను గెలిపించాలని పైనుంచి ప్రెజర్‌ ఉన్నది.. అయినా సరే.. నువ్వన్నట్టే నీకు సపోర్టిస్తా.. పైనోళ్లకు ఏదోటి చెప్పుకుంటా.. ఎంపీటీసీ రిజర్వేషన్‌ నాకు కలిసొస్తే మాత్రం మీ ఓట్లేయించాలె.. మాట తప్పవ్‌ గదా! గీ విషయం ఎక్కడా లీక్‌ చేయనని ప్రమాణం చేయి’ అని మరో నాయకుడి ప్రతిపాదన. ఇదీ అయా గ్రామాలకు చెందిన లీడర్ల మధ్య జరుగుతున్న రహస్య ఒప్పందాలు.

గుట్టు చప్పుడు కాకుండా ఒడంబడికలు..
చాలా గ్రామాల్లో రహస్య ఒప్పందాలు నడుస్తున్నాయి. సర్పంచ్‌ రిజర్వేషన్‌ అనుకూలంగా వచ్చిన వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తూ.. రిజర్వేషన్‌ కలిసి రాని లీడర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్‌ చేస్తే వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో తాను సపోర్ట్‌ చేస్తానంటూ మద్దతు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్న దగ్గర సైతం అంతర్గత చర్చలు జరుపుతున్నారు. సర్పంచ్‌గా ఓ పార్టీకి చెందిన వర్గానికి మద్దతు ఇస్తే.. మరో పార్టీకి చెందిన ఓ వర్గం నుంచి ఉప సర్పంచ్‌ పదవిని ఆశిస్తున్నారు. కొన్ని చోట్ల డబ్బులు కూడా ఆఫర్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

పార్టీలు బలహీనంగా ఉన్నా..
పార్టీలు బలహీనంగా ఉన్న గ్రామాల్లో సైతం లీడర్లు ఒకరికొకరు సపోర్ట్‌ చేసుకోవాలని రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ వీక్‌గా ఉన్న చోట కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్న దగ్గర బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు. ఒకే పార్టీలో గ్రూపులు ఉన్నచోట ఓ వర్గం లీడర్‌ సర్పంచ్‌గా పోటీలో ఉంటే మరో వర్గం నాయకుడు ఇంకో పార్టీకి సపోర్ట్‌ చేస్తున్న ఉదంతాలూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో అధికార కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు సమ ఉజ్జీలు నామినేషన్‌ వేశారు. ఒకరు బీఆర్‌ఎస్‌ మద్దతు కోసం, మరొకరు ఇంకో పార్డీ సపోర్ట్‌ కోసం చర్చలు జరుపుతున్నారు. ఆ రెండు పార్టీల్లో రిజర్వేషన్‌ అనుకూలించని లీడర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తున్నారు.

శత్రువు శత్రువు.. మిత్రువు..!
‘శత్రువు శత్రువు మిత్రువు..’ అనే రీతిలో వివిధ పార్టీల ప్రత్యర్ధుల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంతకాలం ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లుసైతం ఒక్కటవుతున్నారు. అనేక గ్రామాల్లో లీడర్లు సర్పంచ్‌ పదవి కోసం విభేదాలను పక్కనపెట్టి ఏకమయ్యారు. మండల స్థాయి నాయకులు తమకు అనుకూలమైన వారికి ఓ గ్రామ పంచాయతీ టికెట్‌ ఇప్పిస్తే.. ఆ గ్రామంలో అదే పార్టీకి చెందిన అతని వ్యతిరేకులు ఇతర పార్టీ వాళ్లతో ఒప్పందాలు చేసుకొని పోటీకి సై అంటున్నారు. కొన్నిచోట్ల అప్పటికప్పుడు పార్టీలు మారి పోటీకి దిగుతున్నారు. ఇలా సరికొత్త పొత్తులు ఒడంబడికలతో పంచాయతీ ఎన్నికలు రసవత్తరాన్ని సంతరించుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -