నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం సర్పంచ్ కొత్త పల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలపై మండల వైద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహ స్వామిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని గదులను, ల్యాబ్ ను, పరిసరాలను వారు పరిశీలించారు.
ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల సిబ్బంది ప్రేమ పూర్వకంగా వ్యవహరించాలని సర్పంచ్ హారిక సూచించారు. వైద్యులతో పాటు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు పెద్ద ఎత్తున జరిగేలా గ్రామాల్లో సిబ్బంది గర్భిణీలకు అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వివిధ సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన రోగులతో వారు మాట్లాడారు. ఆస్పత్రి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.



