ప్రభుత్వం జీపీ పెండింగ్ బిల్లులు పేమెంట్ చేయకపోవడంతోనే ఈ అఘాయిత్యం
పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి…ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – గంగాధర : సర్పంచ్ హోదాలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ అభివృద్ది కోసం అప్పులు చేసి పనులు చేపట్టారు. ఈ సర్పంచుల పెండింగ్ బిల్లులు పేమెంట్ చేయక, తెచ్చిన అప్పులు తీర్చలేక ఓ గ్రామ మాజీ సర్పంచ్ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. ప్రభుత్వం మాజీ సర్పంచులు చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు పేమెంట్స్ కు నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. గంగాధర మండలం లక్మిదేవిపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ తాళ్ళ విజయలక్ష్మి భర్త రవి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం పేమెంట్ చేయక, తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్య యత్నానికి పాల్పడి అపస్మారక స్థితికి చేరిన రవి పరిస్థితిని గ్రహించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్న తాళ్ల రవిని మాజీ ఎమ్మెల్యే సంకె రవిశంకర్, మాజీ సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ జోగు సాగర్, మాజీ సర్పంచులు మేచినేని నవీన్ రావు, వేముల దామెాదర్, మల్లేశం, అనిత-ఆదిమల్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆకుల మధుసూదన్ పరామర్శించారు.