Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయకనగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని కొనియాడారు.

దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహరాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యూ అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను పాపన్న గౌడ్ అందించారని కొనియాడారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీత వృత్తిదారులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad