నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మహనీయులు సత్యసాయిబా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, భారత ఉప రాష్ట్రపతితో కలిసి పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అరుదైన అవకాశంగా భావిస్తున్నాం అన్నారు. ఆయన ప్రేమతో మనుషులను గెలిచారు.
సేవలతో దేవుడిగా కొలవబడుతున్నారన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారన్నారు. బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతిఒక్కరి బాధ్యతన్నారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సత్యసాయిబాబా ట్రస్టు నెరవేర్చిందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరికి చదువు అందించాలని సత్యసాయిబాబా బలంగా విశ్వసించారన్నారు. కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచిత విద్యను అందించారని తెలిపారు. చివరి దశలో ఉన్న లక్షల మంది పేదలకు సరైన వైద్యం అందేలా చూశారన్నారు. పాలమూరు వంటి వలస జిల్లాకు తాగునీటి సదుపాయం కల్పించారని గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాకు కూడా తాగునీటి వసతులను కల్పించారన్నారు.



