– సెమీస్‌లో వరల్డ్ నం.2పై గెలుపు
– చైనా మాస్టర్స్ సూపర్ 750
షాంఘై (చైనా) : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్, చిరాగ్‌లు చెలరేగారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో మలేషియా జోడీ, వరల్డ్ నం.2 ఆరోన్ చియా, వురు యిక్‌లపై సాత్విక్, చిరాగ్‌లు వరుస గేముల్లో అద్భుత విజయం సాధించారు. 21-17, 21-14తో 41 నిమిషాల్లోనే లాంఛనం ముగించిన సాత్విక్, చిరాగ్‌లు మ్యాచ్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి సహజ శైలిలో సంధించిన స్మాష్‌లు ప్రత్యర్థులను హడలెత్తించగా.. నెట్ దగ్గర చిరాగ్ శెట్టి గోడ కొట్టాడు. సాత్విక్ దూకుడు, చిరాగ్ డిఫెన్స్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఫలితంగా వరల్డ్ నం.2 మలేషియా జోడీ వరుస గేముల్లో చిత్తుగా ఓడింది.
పురుషుల డబుల్స్ సెమీఫైనల్ తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. ప్రథమార్థం నుంచీ ఆధిపత్యం చేతులు మారింది. 11-10తో మలేషియా షట్లర్లు విరామ సమయానికి ముందంజ వేశారు. 13-13 వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన గేమ్‌ను సాత్విక్, చిరాగ్ చేతుల్లోకి తీసుకున్నారు. వరుస పాయింట్లతో ఆధిపత్యం చూపించారు. 21-17తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‌లో సాత్విక్ ధనాధన్ దూకుడు చూపించాడు. స్మాష్‌ల వర్షం కురిపించాడు. ఏ దశలోనూ సాత్విక్, చిరాగ్‌లకు మలేషియా షట్లర్లు పోటీ ఇవ్వలేకపోయారు. 21-14తో అలవోకగా రెండో గేమ్‌తో పాటు ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నారు. గత వారం హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్, చిరాగ్‌లు తాజాగా చైనా మాస్టర్స్ సూపర్ 750లోనూ ఫైనల్లోకి ప్రవేశించారు.
ఫైనల్లో సాత్విక్ జోడీ
- Advertisement -
- Advertisement -