ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ నుంచి భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ తప్పుకుంది. భుజం గాయం బారిన పడిన సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి..కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ఇటీవల స్విస్ ఓపెన్ క్వార్టర్‌ఫైనల్ నుంచి గాయంతో వాకోవర్ ఇచ్చిన సాత్విక్, చిరాగ్‌లు.. ఆసియా చాంపియన్‌షిప్స్‌కు అందుబాటులో ఉంటారని ఆశించినా.. అభిమానులకు నిరాశే ఎదురైంది. సాత్విక్, చిరాగ్ కోచ్ టాన్ కిమ్ (దక్షిణ కొరియా) ఈ మేరకు అధికారులకు సమాచారం అందించింది. సాత్విక్, చిరాగ్ తప్పుకోగా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల డబుల్స్ విభాగంలో భారత్ నుంచి ఎం.ఆర్ అర్జున్, హరిహరణ్‌లు మాత్రమే ఆడనున్నారు. మహిళల డబుల్స్ నుంచి ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జోడీ సైతం తప్పుకున్నా, కారణాలు వెల్లడించలేదు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పోటీలు బుధవారం నుంచి చైనాలోని నింగ్బో నగరంలో జరుగనున్నాయి.



