Thursday, November 20, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాకు నాటోయేతర అతిపెద్ద మిత్రదేశం సౌదీ : ట్రంప్‌

అమెరికాకు నాటోయేతర అతిపెద్ద మిత్రదేశం సౌదీ : ట్రంప్‌

- Advertisement -

వాషింగ్టన్‌ : అమెరికాకు నాటోయేతర అతిపెద్ద మిత్రదేశంగా సౌదీ అరేబియాను పరిగణిస్తున్నట్టు ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్య, భద్రతా సహకారాన్ని పెంపొందిస్తామని వెల్లడించారు. వాషింగ్టన్‌లోని వైట్‌ హౌస్‌లో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీకి ఎఫ్‌-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమన్నారు. ఎఫ్‌-35 యుద్ధ విమానాల టెక్నాలజీ సౌదీ నుంచి చైనాకు లీక్‌ అవుతుందనే అభ్యంతరాలను తన ప్రభుత్వంలోని కొందరు లేవనెత్తినా పట్టించుకోకుండా ఈ డీల్‌కు సిద్దమైనట్టు అమెరికా అధ్యక్షుడు చెప్పారు.

ఈ సమావేశం సందర్భంగా ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్ల విక్రయ డీల్‌పై అమెరికా, సౌదీ సంతకాలు చేయడం గమనార్హం. అమెరికా నుంచి దాదాపు 300 యుద్ధ ట్యాంకులనూ సౌదీ కొనబోతోంది. క్యాపిటల్‌ మార్కెట్లు, అరుదైన ఖనిజ నిక్షేపాల మార్కెట్లు, మనీలాండరింగ్‌ కట్టడి, ఉగ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్‌ను అడ్డుకోవడం వంటి అంశాలకు సంబంధించి కూడా అమెరికా-సౌదీ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కషోగీ హత్య గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. సల్మాన్‌కు ఏమీ తెలియదు అని చెప్పారు. ఇజ్రాయిల్‌తో స్నేహ బంధానికి సంబంధించిన అబ్రహం అకార్డ్స్‌ ఒప్పందాలపై సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఒప్పందాల్లో భాగం కావాలని తమకూ ఉందన్నారు. అయితే ఇజ్రాయిల్‌-పాలస్తీనా వివాదానికి ‘రెండు దేశాల ఏర్పాటు’ పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

పెట్టుబడుల సదస్సు
వాషింగ్టన్‌లోని కెనడీ సెంటర్‌లో బుధవారం సాయంత్రం జరగనున్న పెట్టుబడుల సదస్సులో ట్రంప్‌, ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాల్గొంటారు. ఈ సదస్సులో సౌదీ ఆరామ్‌కో, చెవ్రాన్‌, క్లీవ్‌ల్యాండ్‌ క్లినిక్‌, ఫైజర్‌, క్వాల్‌కామ్‌, సేల్స్‌ ఫోర్స్‌ కంపెనీల అధిపతులు పాల్గొననున్నారు. ఈ దిగ్గజ కంపెనీలన్నీ సౌదీ ప్రభుత్వంతో ఒప్పందాలపై, ఆ దేశపు పెట్టుబడులపై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ ఏడాది మే నెలలో సౌదీలో ట్రంప్‌ పర్యటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -