Saturday, July 26, 2025
E-PAPER

సవ’రణం’

- Advertisement -

గత ఐదు రోజులుగా పార్లమెంటులో ప్రతిపక్షాలు సాగిస్తున్న ఆందోళనలను పౌరసమాజమంతా గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (SIR – Special Summary Revision) పేరుతో జరుగుతున్న ప్రక్రియపై ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని బహిర్గతం చేస్తున్నాయి. వేలాది ఓటర్లు జాబితాల నుంచి గల్లంతవడం, పున:చేరిక ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, నిర్దిష్ట వర్గాలే ఇందుకు లక్ష్యంగా మారడంవంటి ఆరోపణలు తీవ్రమైన ఆందోళనకు దారితీస్తున్నాయి. అయినా కేంద్రం మౌనం వీడకపోడం కేవలం వ్యూహాత్మకం మాత్రమే కాదు, అది కుట్రలో భాగమే అనే అభిప్రాయాలను మరింత ధృవీకరిస్తోంది.
బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ పేరుతో జరుగుతున్న ఓటర్ల తొలగింపులు, చట్టబద్ధంగా ఎన్నికల సంఘం చేపట్టాల్సిన పనులు గుర్తుతెలియని ప్రయివేటు సంస్థలకు అప్పగించడం, అవి అనుసరిస్తున్న పద్ధ్దతుల్లో ఎలాంటి ప్రామాణికతా, పారదర్శకతా లేకపోవడం ప్రజాస్వామ్య విలువలను సవాలు చేస్తున్నాయి. ”డేటా వాలిడేషన్‌” పేరుతో జరుగుతున్న ఈ చట్టవ్యతిరేక చర్యలు అసలైన ఓటర్లను జాబితానుంచి బయటకు నెట్టడం ద్వారా వారి హక్కులను హరిస్తున్నాయి.
దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీల ఓట్లే లక్ష్యంగా జరుగుతున్న ఈ తొలగింపులు ఏలినవారి తలపుల్లోని మాలిన్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఎన్నికల ఫలితాలపై ముందస్తు ప్రభావం చూపాలనే కుట్రలను సూచిస్తున్నాయి. నిజానికి ఓటనేది కేవలం ఓ నిబంధన కింద ఇచ్చే అనుమతి పత్రం కాదు. ప్రజలు చట్ట సభలకు తమ ప్రతినిధులను ఎంపిక చేసుకునేందుకు రాజ్యాంగం కల్పించిన గొప్ప అవకాశం. అది పౌరుల అస్థిత్వాన్ని నిర్ధారించే సాధనం. చట్టబద్ధమైనదే కాక, సాంఘిక న్యాయ పరిరక్షణతో కూడిన రాజకీయ హక్కు. ఇప్పుడది తగిన కారణాలేమీ లేకుండానే హరించబడుతుండటం అనైతికమే కాదు, ఆవేదన కలిగించే అప్రజాస్వామిక చర్య. ఈ అనైతిక అప్రజాస్వామిక పోకడలకు కేంద్రం తెగబడుతుంటే, ఎన్నికల సంఘం మౌనంగా దానికి వంతపాడుతోంది. ప్రజాస్వామ్యానికి ఇంతకన్నా ముప్పు ఇంకేముంటుంది?
ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అచేతనంగా ఉండటం, స్థానిక అధికారుల చేతుల్లో ఓటర్ల జాబితా నియంత్రణా వ్యవస్థ బంధీ కావడం వంటి పరిణామాలు ఈ దేశానికీ, ప్రజాస్వా మ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఎందుకంటే ఇది కేవలం బీహార్‌ సమస్య మాత్రమే కాదు. బీహార్‌ ఒక ప్రయోగశాల మాత్రమే. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలయ్యే ప్రమాదం ఎదురుపడ బోతోంది. నిరూపణకు వారు కోరుతున్న పత్రాల వివరాలు చూస్తే ఓటరుగానే కాదు, ఈ దేశ పౌరుడిగానూ గుర్తింపును కోల్పోవడం ఖాయ మనిపిస్తోంది. ఇలాంటప్పుడు పౌరసమాజాన్ని నిష్క్రియ, నిర్లక్ష్యం, మౌనం ఆవహిస్తే ప్రజలు తమ అస్తిత్వాన్నే కోల్పోయే ప్రమాదంలో పడతారు.
ఇదంతా జరుగుతున్నప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఆందోళన ఎంత సహేతుకమైనదో, సమంజసమైనదో… అధికారపక్ష నిర్లక్ష్య ధోరణి అంత అవాంఛనీయమైనది అనటంలో సందేహం లేదు. ప్రతిపక్షాల నిరసనలో హక్కుల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే నిబద్ధత వ్యక్తమవుతున్నది. కానీ అధికారపక్ష వైఖరిలో ఆ నిబద్ధతకు రాజకీయ నాటకంగా ముద్రవేస్తూ, విమర్శను అణచివేసే, సమాధానం దాటవేసే ధోరణే కనిపిస్తున్నది. ప్రశ్నించే హక్కును చిన్నచూపు చూడడం, మౌనమే సమాధానమన్నట్టుగా వ్యవహరించడం ఇవన్నీ అధికారపక్షం అహంకా రాన్ని, బాధ్యతారాహిత్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. ఇది దేనికి సంకేతం? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం శత్రుత్వానికి సూచిక కాదు. అది ప్రభుత్వానికి సమకాలీన దిశానిర్దేశం చేసే బాధ్యతతో కూడిన చర్య. కానీ కేంద్రం ప్రదర్శిస్తున్న వైఖరి దీన్ని అవమానిస్తోంది. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాదు, ప్రజల అభిప్రాయాలను తుంచివేయడమూ అవుతుంది.
ఇది కేంద్ర ప్రభుత్వ పాలనా ధోరణికి అద్దంపట్టే వ్యవహారం. ”ఎవరు ఓటు వేయాలి, ఎవరు వేయకూడదు” అనే విషయంలో అధికారపక్షం తమకు అనుకూలంగా ‘ఓటర్ల శుద్ధి’ చేపట్టే దిశగా వెళితే, అది నేరుగా ప్రజాస్వామ్యంపై దాడిగా మారుతుంది.
ఇది కేవలం ఓ పరిపాలనా తప్పిదంకాదు. ఇది ప్రజాస్వామ్య నిర్మాణాన్ని నిర్వీర్యం చేసే పన్నాగం. ప్రభుత్వాల ఎంపికలో ప్రజలపాత్రను కుదించే కుట్ర. దీన్ని తిప్పికొట్టేందుకు పార్లమెంటులో ప్రతిపక్షాలు పోరాడు తున్నాయి. ఆ పోరాటం ఇప్పుడు ప్రతిపక్షాలకే కాదు..ప్రతి పౌరుడికీ చెందినది. ఈ కుట్ర లపై మౌనంగా ఉండటమంటే నేరానికి అనుమతినిచ్చినట్టే. ఓటు హక్కు దురాక్రమణకు గురవుతున్న ఈ కాలంలో మౌనం అంగీకారమే అవుతుంది. రేపటి ఎన్నికల్లో మనం ఓటరు జాబితాలో ఉంటామా లేదా అన్న అనిశ్చితికి గురికాకూడదంటే ఈ పోరాటం ప్రజలందరిదీ కావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -