ఇళ్ళంటే…
ఒళ్ళు తిమ్మిరెక్కిన ధన మదాంధులకూ
కళ్ళు పొరలుగమ్మిన ఘన నాయకమ్మన్యులకూ
విలాసవంతమైన విల్లాలు కావచ్చు
ఇంకా చెప్పాలంటే… వినోదభరితమైన సౌధాలూ కావచ్చు
కానీ… వాడిపోయిన పువ్వుల్లోంచి, రాలిపోయిన రేకుల్లాంటి
కూలి నాలి జనాలకు మాత్రం, ఇళ్ళంటే ఎల్లలెరుగని పక్షులు
పుల్లా పుల్లా పోగుచేసి పొందికగా అల్లుకున్న ఎండు చిదుగుల గూళ్ళు!
పట్టెడు గింజల్ని వెతుక్కుంటూ
పగలంతా రెక్కలు ముక్కలు చేసుకునే రోజు కూలీ వలస పక్షులు
రాత్రికి తిరిగి చేరుకునే దాకా…
ఇంకా రెక్కలారక దిక్కులవంక
దిగాలుగా చూసే తమ పిల్లల్ని
అల్లిబిల్లి చేతులు చాచి ఆటలాడించే ఆవాసాలు!
పొద్దు పొడిచి పొద్దు గూకేదాకా
రకరకాల యంత్ర పరికరాలన్నీ
ఒకటొకటిగా విరుచుకుపడి
తమ నాడీమండలాన్ని వేడెక్కిస్తూ
దేహాల్లోని సకల భాగాల్నీ
సమస్త జాయింట్లనూ విప్పుతూ బిగిస్తూ చేసే
బతుకు పోరాటాల్లో ఒళ్ళు హూనమై
కీళ్లుపట్టేసిన నిస్త్రాణ దేహాలకు
కాస్త ఉపశాంతిని ప్రసాదించే
ఆత్మీయ బంధాల ఆరామాలు!
మరి ఆ మాత్రం ఆదరువైనా
అందని శ్రమజీవులు కొందరు
ఏ నగర శివారు ప్రాంతంలోని
ఏ ఖాళీ స్థలాల్లోనో
ఏ మూసీ నది మురికి కాలువ పక్కన
ఏ బస్తి వాడల్లోనో కాకి గూళ్లు నిర్మించుకొని
కాపురాలు చేయటమే నేరమా!
ఏ రాతి గుండెల పాలకులో , కొండొకచో
ఏ రాజకీయ అండగల దుండగులో
జెసిబిలతో విరుచుకుపడి
జాలీ దయా లేకుండా నేలమట్టం
గావించడం ఎంత దారుణం!
పిల్లా పాపల్నే కాదు, అవ్వా తాతల్ని సైతం
ఆత్మీయంగా అక్కున చేర్చుకునే
మసిబారిన చందమామలన్నీ
జెసిబి రాక్షస పళ్ళ , రధ చక్రాల కింద
కర్కశంగా నలిగి నాశనమౌతుంటే…
గుండెలు బద్దలై గొంతులు ప్రవాహాలై
విరుచుకుపడుతున్నా వినిపించుకోకపోవడం
ఎంత విషాదం! ఆధునిక వైజ్ఞానిక యుగంలో
ఈ ఆటవిక విన్యాసాల వెనుక
ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో!
ఏ నెత్తుటి కన్నీళ్ళ మీద
ఏ శిలా విగ్రహాలు లేవనున్నాయో!
– పసివాడ నాస్తిక్
9441724167
ఆటవిక విన్యాసాలు
- Advertisement -
- Advertisement -



