– శాంతి కోసం గళమెత్తిన ఖమ్మం
– మానవత్వాన్ని చాటుతూ పాలస్తీనా సంఘీభావ ర్యాలీ
– ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదుల మద్దతు
– అంతర్జాతీయ వేదికలు స్పందించాలి.. యుద్ధాన్ని ఆపాలి : వామపక్ష నేతలు
– వేలాది మందితో సాగిన ప్రదర్శన
నవతెలంగాణ -ఖమ్మం
ఖమ్మం మానవత్వాన్ని చాటుకుంది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పాలస్తీనాకు మద్దతుగా గురువారం చేపట్టిన ర్యాలీ కనీవినీ ఎరుగని రీతిలో సాగింది. ఫ్లకార్డులు, యుద్ధ మారణకాండ.. పసికందులు, మహిళల మరణాలు.. కండ్లకు కట్టేలా వేషధారణలతో సాగిన ప్రదర్శన ఆలోచింపజేసింది. విశ్వమానవ శ్రేయస్సు కోసం ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులు, విద్యార్థులు కదం తొక్కారు. ప్రపంచ శాంతికి జై కొట్టారు. పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపు మేరకు ఖమ్మంలో నిర్వహించిన సంఘీభావ ర్యాలీ విజయ వంతం అయింది. వేలాది మంది ప్రదర్శనలో పాల్గొన్నారు. యుద్ధంతో జరిగే మారణ కాండను కండ్లకు కట్టేలా వేషధారణలు, పసికందుల మరణాలు, రక్తసిక్తమైన చిత్రాలతో సాగిన ఈ ప్రదర్శన ఆలోచింప జేసింది. ఇజ్రాయిల్ గాజాలో చేస్తున్న జాతి హనన చర్యలకు వ్యతిరేకంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకూ వైరా రోడ్డు పొడవునా ర్యాలీ సాగింది. ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, సీపీఐ(ఎం), సీపీఐ, మాస్‌లైన్, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రదర్శనలో అగ్రభాగాన నిలిచారు. వివిధ మైనారిటీ సంస్థలకు చెందిన మహిళలు, యువకులు జాతీయ జెండాలు, పాలస్తీనా జెండాలతో సంఘీభావం ప్రదర్శిస్తూ ‘సేవ్ గాజా’ అనే నినాదంతో హౌరెత్తించారు. వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ ర్యాలీలో నడిచారు. గాజాలో జాతి హననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ దుశ్చర్యలను ఖండించారు.
కేంద్రం ఖండించక పోవడం దారుణం : నేతలు
పాలస్తీనాపై దాడులను కేంద్ర ప్రభుత్వం ఖండించకపోవడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. ఇప్పటికైనా ఐక్యరాజ్య సమితి తీర్మానానికి కట్టుబడి ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, పాలస్తీనాకు అన్నపానీయాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెతన్యాహుని యునైటెడ్ నేషన్స్ యుద్ధ నేరస్థునిగా ప్రకటించిందనీ, ఇజ్రాయిల్ సైన్యాలు గాజాలో మానవతా సాయాన్ని కూడా అందకుండా చేస్తున్నాయని, ఆహార పదార్థాలు, మందులు అందకుండా చేసి ఆకలి చావులకు గురిచేస్తున్నాయని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వివరించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, నివాస స్థలాలపై బాంబులు కురిపించి వందలాది మంది డాక్టర్లను, వేలాది మంది పసిపిల్లలను చంపిన ఇజ్రాయిల్ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని, గాజాలో ఆహార పదార్థాలు, మందులు, మానవతా సాయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
సేవ్ గాజా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES