నవతెలంగాణ-హైదరాబాద్: ఇంఫాల్‌లో వేలాదిమంది ప్రజలు ‘సేవ్ మణిపూర్’ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆందోళనకారులు రాష్ట్ర ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించకూడదని డిమాండ్ చేశారు. ఈ సేవ్ మణిపూర్ ర్యాలీని మైతీ పౌర సమాజ సంస్థల సమాఖ్య సంస్థ అయిన మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ (సిఓసిఓఎంఐ) నిర్వహించింది.
ఈ ర్యాలీలో ఆందోళనకారులు టిడ్డం గ్రౌండ్ నుండి థాహు గ్రౌండ్ వరకు ఐదుకిలోమీటర్ల మేర నడిచారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ‘మణిపూర్ ప్రాదేశిక, పరిపాలనా సమగ్రతకు రాజీపడేది లేదు’, ‘మణిపూర్‌ను విభజించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకూడదు’, ‘నిర్వాసితులను వారి ఇళ్లకు తిరిగి పంపాలి’ అని రాసిన ప్లకార్డులను చేతబూనారు. ఈ ర్యాలీలో మెయితీలతోపాటు, మణిపురీలు కానివారు, ముస్లింలు, నాగ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీ వల్ల రాజధాని ఇంఫాల్ వ్యాప్తంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా, 2023 మేలో కుకీ- మెయితీల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 260 మంది మృతి చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది.



