– సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం
– అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి, మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
– మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
మహిళ విద్యకు ఆద్యురాలు, సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జనవరి 3 జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మండలంలోని అంగన్వాడీ టీచర్లు, మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ హలో కార్యక్రమానికి సభా అధ్యక్షత పుట్ట రాజు వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు బండారు రాజు, రిటైర్డ్ ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, కాంప్లెక్స్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఐసిడిఎస్ సూపర్వైజర్ షబానా, ప్రధానోపాధ్యాయులు మేరీ నిర్మల, విజయ, అఖిల రాజ్ ఫౌండేషన్ మండల అధ్యక్షుడు సొక్కం స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడి టీచర్లు, ఉపాధ్యాయుల పాత్రలతో గొప్పదన్నారు. సావిత్రిబాయి పూలే మహిళల విద్య కోసం అప్పటి సమాజంలోని ఎన్నో అవరోధాలను ఎదుర్కొని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ నేటి మహిళ ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు విద్యార్థుల్లో విలువలు, సామాజిక స్పృహ, నైతికత పెంపొందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో బాలల ప్రాథమిక విద్య, ఆరోగ్యం, పోషణ విషయంలో చేస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. తల్లి పాత్రతో పాటు ఉపాధ్యాయ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ భవిష్యత్ తరాల పునాది వేస్తున్నారని అన్నారు. మహిళా ఉపాధ్యాయుల కృషి లేకుండా సమాజ ప్రగతి సాధ్యం కాదని స్పష్టం చేశారు.
సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.మహిళలకు విద్య అందినప్పుడే కుటుంబం, గ్రామం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళా ఉపాధ్యాయులను గౌరవించే సంస్కృతి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. చివరగా సన్మానం పొందిన ఉపాధ్యాయులు తమ సేవలను గుర్తించి గౌరవించిన అఖిల రాజ్ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక, విద్యాపరమైన కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహిళ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం సమాజంలో విద్య ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అఖిల రాజ్ ఫౌండేషన్ మండల ఉపాధ్యక్షులు దాతర్ పల్లి భాస్కర్, కోశాధికారి శ్రీనివాస్, కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు కనక రెడ్డి, రాజు, సీఆర్పీలు యాదగిరి స్వామి గౌడ్, ఎల్లా గౌడ్, జర్నలిస్ట్ గణేష్, అంగన్వాడి టీచర్లు, మహిళ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



