యువతకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ముగిసిన జాతీయ పోలీసు ఫుట్‌బాల్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్
దేశ ఫుట్‌బాల్ చరిత్రలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఫుట్‌బాల్‌లో తెలంగాణ వైభవం పునరుద్ధరించటమే లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. యువత వ్యసనాల బారిన పడకుండా.. క్రీడల్లో రాణించాలని, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీఎం అన్నారు. 74వ బిఎన్ మల్లిక్ ఆల్ ఇండియా పోలీసు ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్స్ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి.. పోలీసు క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి అలరించారు. ‘1950 నుంచి 1960 వరకు హైదరాబాద్‌ను నర్సరీ ఆఫ్ ఫుట్‌బాల్ పిలిచేవారు. 1956 భారత ఒలింపిక్స్ ఫుట్‌బాల్ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు హైదరాబాద్ వారు. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఫుట్‌బాల్ జట్టుకు సైతం ప్రత్యేక గుర్తింపు ఉండేది.
పోలీసు ఫుట్‌బాల్ జట్టు ఏకంగా 16 పతకాలు సాధించి సత్తా చాటింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు సాధించటమే లక్ష్యంగా పని చేస్తున్నాం. నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్‌లను ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగంతో రూ. 2కోట్ల నగదు బహుమతితో ప్రోత్సహించింది. క్రీడల్లో రాణించే యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటానని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 34 జట్లు పోటీపడిన జాతీయ పోలీసు ఫుట్‌బాల్ పోటీల పురుషుల విభాగంలో సిఐఎస్‌ఎఫ్ విజేతగా నిలువగా.. గోవా, కేరళలు రజత, కాంస్య పతకాలు సాధించాయి. మహిళల విభాగంలో అస్సాం రైఫిల్స్ విజేతగా నిలువగా.. ఒడిశా, సిఐఎస్‌ఎఫ్ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.



