మోడీ పాలనలో దుర్భరంగా ప్రజల జీవితాలు
తగ్గని పేదరికం, నిరుద్యోగం
మాటలు ఘనం…అభివృద్ధి శూన్యం
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశంలో ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి. 2014, 2019, 2023 ఎన్నికల సమయంలో ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేసిన పథకాలకు పొంతనే లేదు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గడచిన 11 ఏండ్లలో దీన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులు, చేసిన ఖర్చుల వివరాలు ఏవీ పబ్లిక్ డొమైన్‌లో లేవు. వాటికి సంబంధించిన డీపీఆర్‌లనూ ప్రజలతో పంచుకోలేదు. ఫలితంగా ఆయా ప్రాజెక్టుల నాణ్యతపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ హయాంలో కట్టిన అనేక వంతెనలు, ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే కూలిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. వీటన్నింటిపై మోడీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు రంగుల ప్రపంచాన్ని చూపిస్తున్నారు.
ప్రజల పక్షాన నిలవాల్సిన ప్రధాన స్రవంతి మీడియా పాలకుల చెప్పుచేతల్లోనే ఉండటం గమనార్హం. అనేక మీడియా సంస్థలు మోడీ సర్కార్ నుంచి భూమి, పన్ను రాయితీలు, లైసెన్సులు, ఉచిత ఎయిర్‌వేస్ వంటి సౌకర్యాలను పొందుతున్నాయి. 2021లో జరగాల్సిన జనగణనను పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. గత లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పౌరుల బ్యాంక్ ఖాతాల్లో రూ.34 లక్షల కోట్లు నేరుగా జమ చేసి, వారికి సాధికారత కల్పించామని చెప్పుకున్నారు. దానికి సంబంధించిన గణాంకాలు ఎక్కడా లేవు. దేశంలో నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు ఇస్తే దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. ప్రయివేటు సంస్థల ఉద్యోగాలు పరిమితమై పోయాయి. దేశంలోని అనేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం సరిగా లేదు. యూఎన్‌డీపీ నివేదిక ప్రకారం 2023లో మానవాభివృద్ధి సూచీలో భారతదేశం ప్రపంచంలో 130వ స్థానంలో ఉంది.
2022లో 132వ స్థానంలో ఉంది. దేశంలో నెలకొన్న పరిస్థితులపై పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఇస్తున్న వాస్తవ నివేదికలను మోడీ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. వాటికి విరుద్ధంగా స్వోత్కర్షల్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నది. చివరకు న్యాయ వ్యవస్థను సైతం తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నది. ముఖ్యంగా ముస్లింలను ప్రభుత్వ యంత్రాంగం చిన్నచూపు చూస్తున్నది. ఉమర్ ఖలీద్, ఇతర నిందితులు, సోనమ్ వాంగ్‌చుక్ కేసుల్లో ఇది రుజువైంది. చిన్న చిన్న సాకులు చూపి ముస్లింల ఆవాసాలు, వ్యాపారాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. లవ్ జిహాద్, గోవుల అక్రమ రవాణా పేరుతో దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి వాటిని బీజేపీ పాలిత రాష్ట్రాలు నేరాలుగా పరిగణించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. యూపీ, గుజరాత్‌లో క్రైస్తవ సంస్థలను కూడా వదల్లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని దళితులను లక్ష్యంగా ఎంచుకొని వేధింపులు, హింసకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భారత్ తన స్వాతంత్య్రాన్ని కోల్పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



