న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మరోమారు వడ్డీ రేట్లకు కోత పెట్టింది. తాజాగా వడ్డీ రేట్లను 20 బేసిస్ పాయింట్ల (0.20శాతం) మేర తగ్గించింది. శుక్రవారం నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని తెలిపింది. అత్యధిక వడ్డీ ఇచ్చే 444 రోజుల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ వృష్టితో పాటు అన్ని కాలావధి డిపాజిట్లపై ఈ కోత ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. 444 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై ఇప్పటివరకు 7.05 శాతం వడ్డీ ఇచ్చింది. తాజాగా దీన్ని 6.85 శాతానికి సవరించింది. రూ.3 కోట్ల లోపు ఎఫ్‌డీలపై 1-2 ఏండ్ల వ్యవధికి వడ్డీ రేటును 6.50శాతానికి పరిమితం చేసింది. కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండు సార్లు తగ్గించిన నేపథ్యంలో రుణాలు, ఎఫ్‌డీలపై బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.