– క్యూ3లో రూ.21,028 కోట్ల నికర లాభాలు
– మొత్తం వ్యాపారం రూ.103 లక్షల కోట్లు
ముంబయి : బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 24 శాతం వృద్ధితో రూ.21,028 కోట్ల నికర లాభాలు సాధించింది. ఈ ప్రభుత్వ రంగ విత్త సంస్థ 2024-25 ఇదే త్రైమాసికంలో రూ.18,853 కోట్ల లాభాలు నమోదు చేసింది. అదే సమయంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.41,446 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 9.04 శతం పెరిగి రూ.45,190 కోట్లుగా చోటు చేసుకుంది.
ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తుల్లోనూ 50 బేసిస్ పాయింట్లు తగ్గి 1.57 శాతానికి, నికర ఎన్‌పిఎలు 14 బేసిస్ పాయింట్లు తగ్గి 0.39 శాతానికి పరిమితమయ్యాయి. 2025 డిసెంబర్ ముగింపు నాటికి ఎస్‌బిఐ మొత్తం వ్యాపారం రూ.103 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ.57 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.46 లక్షల కోట్ల అడ్వాన్సులు ఉన్నాయి. గడిచిన క్యూ3లో రుణాల జారీలో 15 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాస డిపాజిట్లు 9 శాతం పెరిగాయి.
లాభాల్లో ఎంఎఫ్ కీలక పాత్ర : చైర్మెన్ సిఎస్ శెట్టి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత త్రైమాసిక లాభాల వృద్ధిలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అందించిన రూ.2,200 కోట్ల ప్రత్యేక డివిడెండ్ కీలక పాత్ర పోషించిందని బ్యాంక్ చైర్మెన్ సిఎస్ శెట్టి వెల్లడించారు. ఈ డివిడెండ్‌తో పాటు పెరిగిన ఫీజు ఆదాయం, రైట్ ఆఫ్ చేసిన అకౌంట్ల నుంచి రికవరీలు, నికర వడ్డీ ఆదాయం కూడా బ్యాంక్ లాభాలను పెంచడంలో దోహదపడ్డాయని వివరించారు.
ఎస్బీఐ ఫలితాలు భళా..!
- Advertisement -
- Advertisement -


