వడ్డీ రేట్ల పెంపు
కొత్త ఖాతాదారులపై పావు శాతం భారం
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే నూతన రుణ గ్రహీతలపై మాత్రమే 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) పెంచుతున్నట్లు శనివారం వెల్లడించింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు వెల్లడించింది. ముఖ్యంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఖాతాదారులపై ఇది ఎక్కువ ప్రభావం చూపనుందని తెలిపింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచింది. ఇతర బ్యాంక్‌లు కూడా ఇదే బాటలో నిర్ణయం తీసుకొవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాల వ్యవధిని బట్టి ఉండనుంది. ఇప్పటివరకు ఎస్బీఐ గృహ రుణ రేట్లు 7.50 శాతం నుంచి 8.45శాతంగా ఉండగా.. తాజా పెంపునతో ఇది 7.50శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. సిబిల్ స్కోరు తక్కువగా ఉండేవారికి ఇకపై అధిక వడ్డీ రేట్లను చెలించాల్సి ఉంటుంది.”సిబిల్ స్కోరు, ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు ఆధారంగా విధించే వడ్డీరేట్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్పులు చేసింది. గృహ రుణాలపై మార్జిన్ పెంచుకునేందుకే వడ్డీరేట్లను పెంచాం. ఈ పెంపు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే తీసుకున్న గృహరుణాలకు ఇది వర్తించదు” అని ఎస్బీఐ వర్గాలు స్పష్టం చేశాయి. యూనియన్ బ్యాంక్ రుణ రేట్లు గతంలో 7.35శాతం ప్రారంభం కాగా.. ఇప్పుడు దాన్ని 10 బేసిస్ పాయింట్లు పెంచి 7.45 శాతానికి చేర్చింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును 5.5 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడం ఆర్థిక వ్యవస్థలో బలహీనత సంకేతాలను స్పష్టం చేస్తోన్నాయి.
బ్యాంక్ పేరు రుణ రేటు(శాతం)
ఎస్బీఐ 7.50-8.45
యూనియన్ బ్యాంక్ 7.45
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.90
యాక్సిస్ బ్యాంక్ 8.35
నెలకు రూ.450 అదనం
ఎస్బీఐ తాజాగా వడ్డీ రేటు పెంపును విశ్లేషిస్తే.. ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధితో రూ.30 లక్షల గృహ రుణాన్ని 8.45 శాతం వడ్డీ రేటుతో తీసుకుంటే వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సుమారు రూ.25,830 ఉండగా.. కొత్త రేటు 8.70 శాతం అమల్లోకి వస్తే ఈఎంఐ మొత్తం రూ.26,278కి పెరుగుతుంది. అంటే నెలకు రూ.450 అదనపు భారం పడనుంది. మొత్తం రుణ వ్యవధిలో రూ.1 లక్షకు పైగా అదనపు చెల్లింపు అవుతుందని అంచనా.
గృహ రుణాలపై ఎస్బీఐ బాదుడు
- Advertisement -
- Advertisement -