Wednesday, July 2, 2025
E-PAPER
Homeజాతీయంసుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు..!

సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు..!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశ అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్టు చరిత్రలో ఒక కీలకమైన, చారిత్రక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు తొలిసారిగా, తన సిబ్బంది నియామకాలు, పదోన్నతుల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు రిజర్వేషన్ల విధానాన్ని అధికారికంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం దిశగా సుప్రీంకోర్టు ఒక బలమైన ముందడుగు వేసినట్లయింది.

ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ జూన్ 24న సుప్రీంకోర్టు ఒక అంతర్గత సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, రిజర్వేషన్ల విధానం జూన్ 23, నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. దీని ప్రకారం, కోర్టులో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్సీ వర్గాలకు 15 శాతం, ఎస్టీ వర్గాలకు 7.5 శాతం కోటా వర్తిస్తుంది. ఈ రిజర్వేషన్ల అమలు కోసం రూపొందించిన ‘మోడల్ రిజర్వేషన్ రోస్టర్’, సంబంధిత రిజిస్టర్ల వివరాలను కోర్టు అంతర్గత నెట్‌వర్క్ అయిన ‘సుప్‌నెట్’లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

ఈ రిజర్వేషన్ విధానం సుప్రీంకోర్టులోని రిజిస్ట్రార్లు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు, జూనియర్ కోర్టు అసిస్టెంట్లు, ఛాంబర్ అటెండెంట్లు వంటి పలు స్థాయిల్లోని పోస్టులకు వర్తించనుంది. ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. విడుదల చేసిన రిజర్వేషన్ జాబితాలో ఏవైనా లోపాలు ఉన్నాయని భావిస్తే, సిబ్బంది తమ అభ్యంతరాలను నేరుగా రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్) దృష్టికి తీసుకురావచ్చని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయి హయాంలో ఈ చారిత్రక నిర్ణయం వెలువడటం గమనార్హం. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించిన రెండో వ్యక్తిగా జస్టిస్ గవాయి చరిత్ర సృష్టించారు. ఆయన పదవీకాలంలోనే అత్యున్నత న్యాయస్థానంలో రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -