Tuesday, November 4, 2025
E-PAPER
Homeజాతీయంరూ.3వేల కోట్లకుపైగా కుంభకోణం

రూ.3వేల కోట్లకుపైగా కుంభకోణం

- Advertisement -

‘డిజిటల్‌ అరెస్టు’లపై కఠిన ఆదేశాలిస్తాం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : డిజిటల్‌ అరెస్టులు ఓ కుంభకోణం స్థాయికి చేరుకున్నాయని, ఇప్పటివరకు భారత్‌లోనే రూ.3వేల కోట్లకు పైగా మొత్తాలను బాధితుల నుండి మోసగాళ్లు కొల్లగొట్టారని సుప్రీంకోర్టు పేర్కొంది. అది కూడా మెజారిటీ సంఖ్యలో వృద్ధులను లక్ష్యంగా చేసుకునే ఇదంతా జరిగిందని, వీటిని అరికట్టే సంస్థల బలోపేతానికి కఠినమైన ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందజేసిన విశ్వసనీయమైన నివేదికను ప్రస్తావిస్తూ, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ సోమవారం ఈ వ్యాఖ్యలు చేసింది. డిజిటల్‌ అరెస్టులనేది చాలా పెద్ద సవాలుగా మారిందని ఈ నివేదికను చూస్తుంటే అర్థమవుతోందని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. మనం అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా ఈ సమస్య పాతుకుపోయిందని పేర్కొన్నారు. మోసం జరుగుతున్న తీరు, పరిధి చాలా విస్తృతంగా వుందని నివేదికను చూస్తే తెలుస్తోందన్నారు. ఒక్క భారతదేశంలోనే రూ.3వేల కోట్లకు పైగా మొత్తాలను బాధితుల నుండి వసూలు చేశారంటే ఇక అంతర్జాతీయ స్థాయిలో ఎలా వుంటుందో ఆలోచించుకోవచ్చన్నారు.

ఊహించిన దానికన్నా మించి డిజిటల్‌ అరెస్టు కుంభకోణం స్థాయి వుందని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యలతో కేంద్రం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఏకీభవించారు. ఇటువంటి మోసగాళ్లకు వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు న్యాయ వ్యవస్థ చాలా కఠినమైన ఆదేశాలు జారీ చేస్తుందని, ఇందుకు అందరి మద్దతు కావాలని జస్టిస్‌ కాంత్‌ చెప్పారు. మనీ లాండరింగ్‌ ముఠాలే ఈ సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాయని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి అన్నారు. కోర్టు, దర్యాప్తు సంస్థల ఫోర్జరీ ఉత్తర్వులను సాకుగా చూపి హర్యానాలోని అంబాలాలో ఒక వృద్ధ జంటను డిజిటల్‌ అరెస్టు చేసి రూ.1.05 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఘటనను సుప్రీంకోర్టు తనకు తానుగా పరిగణనలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా ఇలాంటివి అనేక కేసులున్నాయని తర్వాత న్యాయస్థానానికి తెలియజేస్తూ కేంద్రం ఒక నివేదిక సమర్పించింది. ఈ సమస్య కలిగించే ప్రభావం చాలా ఎక్కువ అని, ఇందులో ఆర్థిక కోణమే కాదని, మానవీయ కోణం కూడా వుందని మెహతా పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారిని బానిసలుగా మారుస్తున్నారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -