Saturday, February 21, 2026
E-PAPER
Homeబీజినెస్బిర్యానీ బిల్లుల్లో రూ.70వేల కోట్ల స్కామ్‌

బిర్యానీ బిల్లుల్లో రూ.70వేల కోట్ల స్కామ్‌

- Advertisement -

ఆరేండ్లలో భారీగా పన్ను ఎగవేతలు
తెలుగు రాష్ట్రాల్లో రూ.5వేల కోట్ల మోసం
బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మాయాజాలం
ఐటీ దాడుల్లో వెల్లడి

హైదరాబాద్‌ : బిర్యానీ బిల్లులో భారీ మాయాజాలాన్ని ఐటి అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఒక బిర్యానీ రెస్టారెంట్‌ చైన్‌పై ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్వహించిన సాధారణ విచారణ.. దేశవ్యాప్త ఆహార పరిశ్రమలో వేళ్లూనుకున్న ఒక విస్తుపోయే కుంభకోణాన్ని బట్టబయలు చేసింది. బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో జరుగుతున్న అవకతవకలను అధికారులు కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా గుర్తించారు. హైదరాబాద్‌లో డొంకలాగితే 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి దేశవ్యాప్తంగా వివిధ ఆహార సంస్థలు సుమారు రూ.70,000 కోట్ల మేర విక్రయాలను అధికారిక లెక్కల్లో చూపకుండా దాచిపెట్టినట్లు నిర్ధారించారు.

కస్టమర్లు తమ చెల్లింపులు పూర్తి చేసిన వెంటనే బిల్లింగ్‌ సిస్టమ్స్‌ నుంచి ఆ రికార్డులను పూర్తిగా తొలగించడం లేదా సవరించడం ద్వారా రెస్టారెంట్లు ఈ భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఈ అక్రమాలను ఛేదించడానికి ఐటీ శాఖ బిగ్‌ డేటా అనలిటిక్స్‌, జెనరేటివ్‌ ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా వాడుకున్నాయి. మార్కెట్‌లో 10 శాతం వాటా కలిగిన ఒక ప్రముఖ బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్లాట్‌ఫారమ్‌ను ట్రాక్‌ చేసిన అధికారులు.. అహ్మదాబాద్‌లోని ఆ సంస్థ కేంద్రం నుంచి దాదాపు 60 టెరాబైట్ల లావాదేవీల డేటాను సేకరించారు.

ఆరేండ్లలో రూ.2.43 లక్షల కోట్ల విక్రయాలు..
హైదరాబాద్‌లోని ఆయకర్‌ భవన్‌లో ఉన్న డిజిటల్‌ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌లో సుమారు 1,77,000 రెస్టారెంట్‌ ఐడీలను విశ్లేషించగా.. గత ఆరేండ్లలో జరిగిన రూ.2.43 లక్షల కోట్ల విక్రయాల్లో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ను వాడుతున్న రెస్టారెంట్లు ఏకంగా రూ.13,317 కోట్ల విలువైన బిల్లులను రికార్డ్‌లో నమోదయిన తర్వాత సిస్టమ్‌ నుంచి తొలగించినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలోనే దాచిపెట్టిన విక్రయాల విలువ రూ.5,141 కోట్లుగా తేలింది.

వీటిని ధ్రువీకరించడానికి తెలుగు రాష్ట్రాల్లోని 40 రెస్టారెంట్లలో జరిపిన భౌతిక తనిఖీల్లోనే రూ.400 కోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. పన్ను ఎగవేతలో కర్నాటక రూ.2,000 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రూ.1,500 కోట్లు, తమిళనాడు రూ.1,200 కోట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సాధారణంగా నగదు రూపంలో జరిగే ఇన్వాయిస్‌లను ఎంపిక చేసి తొలగించడం లేదా రిటర్న్స్‌ ఫైల్‌ చేసే ముందు ఒక రోజు లేదా నెల మొత్తం డేటాను తుడిచివేయడం ద్వారా ఈ మోసం సాగింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 27 శాతం లేదా నాలుగోవంతు వరకు ఇలాగే దాచిపెడుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -