– టెండర్ల కొటేషన్ల మొదలు… నిధుల దారి మళ్లింపు వరకు…
– ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు వూన్యం
– అధికారులపై నిప్పులు చెరిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ నగరపాలక సంస్థలో ‘స్మార్ట్ సిటీ’ అభివృద్ధి పనుల పేరుతో వందల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరుగుతోందని మాజీ మేయర్, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హోటల్ తారకలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజాధనాన్ని రాక్షసుల్లా దోచుకుంటూ సంచులు నింపుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నగరంలోని మూడు ప్రధాన జంక్షన్ల నిర్మాణాన్ని ప్రభుత్వ నిబంధనల (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం కాకుండా, కేవలం కొటేషన్ల ఆధారంగా అప్పగించి భారీ అక్రమాలకు పాల్పడ్డారని రవీందర్ సింగ్ ఆరోపించారు. ‘కాపువాడ జంక్షన్ ఫౌంటెన్ వైరింగ్‌కు రూ.17.50 లక్షలు ఖర్చు చేసినట్లు చూపడం విడ్డూరంగా ఉంది. బంగారు తీగలతో వైరింగ్ చేసినా అంత ఖర్చు కాదు’ అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు కష్టపడి పైసా పైసా కూడబెట్టి చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) నిధులను, ప్రభుత్వ జీవో 190కి విరుద్ధంగా ఇతర పనులకు మళ్లిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఎల్‌ఆర్‌ఎస్ నిధుల లెక్కలు అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రజల సొమ్మును అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వర్షాకాలంలో మొక్కలు నాటడం, ఇంకుడు గుంతలు నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టేవారని, ఇప్పుడు నర్సరీ ఏర్పాటు చేసినా ఒక్క మొక్క కూడా నాటలేదని, అభివద్ధి కార్యక్రమాలను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.
అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
అవినీతి అధికారులపై సాక్ష్యాధారాలతో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని రవీందర్ సింగ్ వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి, ఈ ‘స్మార్ట్ దోపిడీ’కి పాల్పడిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి నుంచి అక్రమ సొమ్మును రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లంచగొండి అధికారులను ప్రజలే ఊరికిచ్చి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు గుంజపడుగు హరి ప్రసాద్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.