వెలుగుమట్ట రెవెన్యూ పరిధిలో పేదల ఇండ్ల కూల్చివేత
కన్నీరు మున్నీరైన బాధితులు
మరో చోటైనా కేటాయించాలని వేడుకోలు
పోలీసుల దౌర్జన్యం.. ఉద్రిక్తత
భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో 1250 ఇండ్లు కూల్చివేత
30.07 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
బోర్డు ఆదేశాల మేరకే భూముల స్వాధీనం: అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి
ఇండ్ల కూల్చివేతను నిరసిస్తూ సీపీఐ(ఎం) నేతల ఆందోళన, అరెస్టు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని 147, 148, 149 సర్వే నెంబర్లలో దాదాపు 31.7 ఎకరాల భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇండ్లను భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాలతో ప్రభుత్వం తొలగిం చింది. వందలాది పొక్లెయిన్లు, ట్రాక్టర్లు, 400 మందికి పైగా పోలీసు బలగాలతో మంగళ వారం ఉదయాన్నే ఇండ్ల కూల్చివేత చర్యలను చేపట్టింది. కొందరు నాయకుల మాటలు నమ్మి రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి.. పదేండ్ల క్రితం నిర్మించుకున్న ఇండ్లను కూల్చివే స్తుండటంతో బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.
నిశ్చేష్టులై..
గత కొన్ని సంవత్సరాల క్రితం యూసీసీఆర్‌ఐ(ఎంఎల్) పార్టీ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి వలస వచ్చిన దాదాపు 1200 కుటుంబాలు 31.7 ఎకరాల భూదాన్ భూముల్లో స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ భూముల్లో అక్రమంగా నివసిస్తున్నారంటూ రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. నివాసాలను ఖాళీ చేయించే క్రమంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. ఖమ్మం జిల్లా పోలీసులే కాకుండా పక్కనున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పించారు, దాదాపు నాలుగు వందల మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు.
మోసగించిన నాయకులు.. సమిధలైన పేదలు
నాయకుల చేతిలో మోసపోయిన అమాయక పేదలే సమిధలుగా మారారు. కొంతమంది నాయకులు కమిటీల పేరుతో బాధితుల దగ్గర రూ. కోట్లు వసూళ్లు చేశారని వాపోతు న్నారు. ఇటీవల కాలంలోనే రూ. ఐదు లక్షలు చెల్లించి వంద గజాల స్థలాన్ని కొనుక్కున్నానని ఓ మహిళ ఫోన్ పేల ద్వారా నాయకులకు చెల్లించిన లావాదేవీ లను చూపిస్తూ బోరున విలపించింది. మరో బాధితుడు కొంత మంది నాయ కుల మాటలు నమ్మి ఆడపిల్ల పెండ్లి కోసం దాచుకున్న రూ. పది లక్షలు వెచ్చించి 150గజాలు కొనుగోలు చేశానని మీడియా ముందు కంటతడి పెట్టడం కలచి వే సింది. ఇండ్లస్థలాలు కొనుగోలు చేసేటపుడు ‘మీకోసం మా ప్రాణాలైనా ఇస్తాం.. మీ స్థలాలు ఎక్కడికి పోవు’ అంటూ నాయకులు చెప్పిన మాయ మాటలు నమ్మి తిని తినక కడుపు మాడ్చుకొని కొనుగోలు చేశామన్నారు. ఇప్పుడూ ఏ నాయకుడు కనిపించడంలేదని.. ఫోన్లుచేసినా స్పందించడంలేదని వాపోయారు. కొందరు బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. అక్రమంగా వసూళ్లు చేసిన నాయకుల పై ఆధారాలతోసహా కేసులు పెడతామని, పోలీసధికారులు సహకారమందించా లని వేడుకున్నారు. మరోచోట స్థలాలు కేటాయించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
భూదాన్‌యజ్ఞ బోర్డు ఆదేశాలమేరకే భూముల స్వాధీనం : అదనపు కలెక్టర్
తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు ఆదేశాల మేరకు వెలుగు మట్ల భూములు స్వాధీనం చేసుకున్నామని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆక్రమణ దారుల సామగ్రి అంబేద్కర్ భవనంలో భద్రపర్చామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెలుగు మట్ల భూదాన్ భూముల్లో అక్రమ కట్టడాల తొలగింపుపై లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ప్రసాద రావుతో కలిసి మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పలుమార్లు రికార్డులు పరిశీలించి విచారణ చేసిన తర్వాత తెలంగాణ భూదాన్ బోర్డు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించామన్నారు. ప్రస్తుతం నిరాశ్రయు లైన వారికి కమ్మవారి సంఘంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని, సామగ్రి భద్రంగా అంబేద్కర్ భవనంలో స్టోర్ చేశామని, దాన్ని బాధితులు ఎక్కడికి తరలించాలంటే అక్కడికి చేరవేస్తామని తెలిపారు. డీసీపీ మాట్లాడుతూ.. భూ దాన్ భూముల కేటాయింపు సంబంధించి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు.
ఇండ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎం) ఆందోళన, అరెస్టులు
ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్య అని సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాస్‌రావు ఖండించారు. పదేండ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వందలాది పేద కుటుంబాలను ఒక్కసారిగా భారీ పోలీస్ బలగాలతో ఖాళీ చేయించడం సరైంది కాదన్నారు. పేదల నివాస హక్కును రక్షించాల్సిన ప్రభుత్వం, వారి ఇండ్లను కూల్చివేసి రోడ్డున పడేయడం అన్యాయమని విమర్శించారు. ఇండ్ల కూల్చివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన శాంతియుత నిరసనలో పాల్గొన్న సీపీఐ(ఎం) నాయకులను అరెస్ట్ చేసి నిర్బంధించడం సరైనది కాదన్నారు. ఇదే సమయంలో కొంతమంది అరాచక శక్తులు ఈ ఇండ్ల సమస్యను ఆసరాగా చేసుకుని పేదల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన పేద కుటుంబాలందరికీ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం, ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్‌రెడ్డి, భూక్యా శ్రీనివాస్‌రావు, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, నాయకులు కూచిపూడి నరేష్, వడ్లముడి నాగేశ్వరరావు, మల్లికార్జున్‌రెడ్డి, కొండం కరుణాకర్, పి.సుభాష్, నల్లమల్ల సత్యనారాయణ, జట్ల ఆనందరావు, పోటు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.



