Wednesday, October 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఉపకార వేతనాలు భిక్ష కాదు..

ఉపకార వేతనాలు భిక్ష కాదు..

- Advertisement -

విద్య సమాజ పురోగమనానికి మొదటి మెట్టు. విద్య మానవుని స్వీయ గౌర వాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో ఒక గుర్తింపునిస్తుంది. కమ్యూనిజం ప్రకారం ఆదిమ సమాజం నుండి మొదలు.. బానిస, భూస్వామ్య పెట్టుబడిదారి దశలన్నీ పోయిన తర్వాత సామ్యవాద సమాజం వస్తుంది. ఈ పరివర్తనలో విద్య పాత్ర ప్రముఖమైనది. మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విద్యారంగానికి పాలకులు మాత్రం ఖాళీ చేయి చూపించడం బాధాకరమైన అంశం. ప్రపంచవ్యాప్తంగా విద్యకు ఎంత గానో ప్రాధాన్యతను ఇస్తుంటే మన దేశంలో మన రాష్ట్రంలో విద్యను పాతాళానికి తోక్కేస్తున్నది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు విద్యను అందని ద్రాక్షగా మార్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సమాజంలో నెల కొన్న అసమానతల మూలాన అందరికి సమాన అవకాశలుండవు. కనుక వివిధ స్థాయిల్లో మేలు చేసే పథకాలు అనేక విద్యార్ధి పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనివార్యంగా ప్రవేశపెట్టాయి. పది మందికి ఉపకారం చేస్తే మేలు జరుగుతుంది అని పాఠశాలలో చెప్పేవారు. మరి వాటిని అబద్దం చేసేలా నేటి పాలకుల విధానాలున్నాయి. విద్యార్థులకు తమ దయతో ఇస్తున్నవి కాదు ఉపకారవేతనాలు, వారి హక్కు.
సామాజిక నేపథ్యంతో పాటు ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కల్పిం చిన ఆయా రిజర్వేషన్ల వలన విద్యార్థులకు ప్రభుత్వాలు చేయూతనిస్తాయి అని బాకీపడి ఉన్నాయి. ఇది రాజ్యాంగ రూపకర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దూర దృష్టితో రాజ్యంగంలో పొందుపరిచినా అంశాల మేరకు, వాటి సాధన కోసం విద్యార్ధి ఉద్యమాల ఫలితంగా ప్రభు త్వాలు కాదనలేని స్థితి ఉన్నది. అసెంబ్లీలో ‘అటు వాళ్లు ఇటు, ఇటు వాళ్లు అటు’ కుర్చు న్నంత మాత్రాన పాత బకాయిలు చెల్లించమంటే కుదరదు కదా. గతం కన్నా వర్తమానం బాగుందనిపించేలా ప్రభుత్వాల పనితీరుండాలి. కానీ పాత పాలకులతో పోటీపెట్టి, కుంటి సాకులతో విద్యార్థులు భవిష్యత్తుతో ఆడుకుంటు న్నారు.ప్రభుత్వ పాలసీలు ఉంటాయి వాటికి లోబడి పాత కొత్త బకాయిలు విడుదల చేయాల్సి ఉం టుంది. కానీ గడిచిన నాలుగేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాల విడు దలో జాప్యం జరుగుతూ వస్తున్నది. మాజీ, తాజా పాలకులు విద్య మీద సవతి తల్లిప్రేమ చూపిస్తున్నారు. డిగ్రీలు అయిపోయి చేతిలో పట్టాలు లేక నిరుద్యో గులుగా పడరాని కష్టాలు పడుతున్నారు. విద్యాలయాలు ఆయా విదార్థి, విద్యార్థినులకు ‘ప్రభుత్వం రావాల్సిన ఉపకార వేతనాలు రాలేదు.కనుక మేము మీ సర్టిఫికెట్స్‌ ఇవ్వ మని’ చేతులెత్తేస్తున్నారు. పిల్లల పై చదువుల కోసం తల్లిదండ్రులు తప్పనిసరిగా అప్పోసప్పో చేసి సర్టిపికెట్లు తెస్తున్న దుస్థితి దాపురించింది.
సుమారుగా ఇవ్వాల్సిన రూ.1,200 కోట్ల బకాయిల్లో విద్యాసంస్థల న్యాయబద్ధ పోరాటాల మూలాన ప్రభుత్వ పెద్దలు దసరాకి రూ.300 కోట్లు దీపావళికి మరో 300 కోట్లు ఇస్తామని ప్రకటించారు. మిగిలిన 600 కోట్లు ఈ నవంబర్‌ చివరి నాటికి విడుదల చేస్తామని కూడా మాటిచ్చారు, కానీ అన్ని గాలికొదిలేశారు. ఒక విధంగా ప్రభుత్వ పెద్దల మధ్య సమన్వయం కొరవడిందా అనే అనుమానాలు బలపడు తున్నాయి. ముఖ్యమంత్రినేమో ‘మీకు ఏది కావాలన్నా అడగండ,ి నేను చేసి పెడతాను’ అని చెబుతున్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం ఉపన్యాసానికి, వాస్తవ రూపంలో కాల యాప నకు ఏ మాత్రం సంబంధం లేదు. ప్రయివేటు విద్యాసంస్థలు మాత్రమే కాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కూడా సిబ్బందికి వేతనాలు ఇచ్చే స్థితిని కోల్పోయాయి. మానవతా దృక్ప థంతో అప్పులు తెచ్చి వేతనాలిస్తున్న వైనం నెలకొంది. ఇప్పటికే అనేక యాజమాన్యాలు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. దాదాపు లక్షల్లో ఉన్న బోధనా, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్యం మూలాన ఆయా కుటుంబాలు జీవనం నిలిచి పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యా రంగం ఉట్టికెక్కుతుంది. నిరుద్యోగం విలయ తాండవం చేస్తుంది. అర్హతలు ఉండి కూడా కొలువుచేయలేని దుర్భర స్థితికి ప్రభుత్వమే నెడు తుంది. ఫలితంగా సమాజం అభివృద్ధి స్తంభించే స్థితి నెలకొంటుంది.
పెండింగ్‌ బకాయిలు తక్షణమే ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయా లనీ ప్రభుత్వం మీద పౌరసమాజం ఒత్తిడి పెంచాలి.ఆ విధమైన కార్యాచరణలో ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొనాలి. విద్యారంగాన్ని ఉన్నతీకరించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కనుక ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల పక్షాన నిలబడాలి. నాలుగు గోడల మధ్యలో ఏర్పడ్డ తరగతి గది అంతర్జాతీయ మానవాళి మార్పు కోసం, క్షేమం కోసం పాటు పడుతుంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది.

  • డా.పోటు నారాయణ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -