Tuesday, July 22, 2025
E-PAPER
Homeజాతీయంవడగాలులతో ఏడాదిన్నర బడికి దూరం

వడగాలులతో ఏడాదిన్నర బడికి దూరం

- Advertisement -

– చిన్నారుల విద్యా ఫలితాలపై గణనీయమైన హానికారక ప్రభావం
– అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ :
పర్యావరణ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. వీటికి తోడు వడగాల్పులు జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ వాతావరణ మార్పులు విద్యపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయని అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది. వడగాల్పులకు చిన్నారులు త్వరగా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఏడాదిన్నరపాటు పాఠశాల విద్యను కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఇది దశాబ్దాల పాటు విద్యారంగంలో సాధించిన అభివృద్ధిని నాశనం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.

పర్యావరణ మార్పులతో వడగాల్పులు, కార్చిచ్చులు, తుఫానులు, వరదలు, కరువులు, వ్యాధులు మరియు సముద్ర మట్టాలు పెరగడం వంటి ప్రకృతి విపత్తులు తీవ్రమవుతున్నాయి. ఈ విపత్తులతో మధ్య -ఆదాయ దేశాలు ప్రతి ఏడాది పాఠశాలలను మూసివేస్తున్నాయని, దీంతో విద్యార్థుల్లో అభ్యాసం క్షీణించడం, డ్రాపవుట్స్‌ పెరగవచ్చని సూచించింది. ”మానిటరింగ్‌ అండ్‌ ఎవాల్యుయేటింగ్‌ క్లైమేట్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఎంఈసీసీఈ)” కింద యునెస్కోకి చెందిన అంతర్జాతీయ విద్య పర్యవేక్షణ (జీఈఎం) బందం, కెనడాలోని సస్కెట్చేవాన్‌ యూనివర్సిటీలు ఈ నివేదికను రూపొందించాయి. గత 20 ఏండ్లల్లో సుమారు 75శాతం తీవ్ర వాతావరణ పరిస్థితులతో పాఠశాలలు మూసివేయబడ్డాయని, ఇవి ఐదు మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ మందిని ప్రభావితం చేశాయని తెలిపాయి.

చిన్నారుల విద్యపైనే..
ముఖ్యంగా ఉష్ణోగ్రతలు చిన్నారుల విద్యా ఫలితాలపై గణనీయమైన హానికారక ప్రభావాలను చూపుతున్నాయని పేర్కొంది. 1969-2012 మధ్య 29 దేశాలకు చెందిన జనగణన , వాతావరణ సమాచారాన్ని విశ్లేషించగా.. ముఖ్యంగా ఆగేయాసియాలో, గర్బధారణ పూర్వ మరియు ప్రారంభ జీవిత కాలంలో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలకు గురికావడంతో తక్కువ సంవత్సరాల పాఠశాల విద్య పొందినట్లు స్పష్టమైంది. సగటు కంటే రెండు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతను ఎదుర్కొంటున్న పిల్లవాడు మిగిలిన పిల్లల కంటే 1.5 సంవత్సరాలు తక్కువ పాఠశాల విద్యను పొందుతాడని అంచనా వేయబడింది. అమెరికా వంటి దేశాల్లో ఎసిలు లేకపోవడంతో.. పాఠశాల సంవత్సరంలో 1డిగ్రీ సెంటిగ్రేడ్‌ వేడిగా ఉండటం వలన పరీక్షల్లో స్కోరులు ఒక్కశాతం తగ్గాయి. అధిక వేడిగా ఉన్న పాఠశాల రోజులు ఆఫ్రికా, అమెరికాల్లోని విద్యార్థులపై అసమానంగా ప్రభావం చూపాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థలను నవీకరించాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది.ఈ ప్రభావం అట్టడుగు వర్గాలపై గణనీయంగా ఉందని పేర్కొంది. 2019లో తీవ్ర వాతావరణ మార్పులకు అధికంగా ప్రభావితమైన 10 దేశాల్లో, ఎనిమిది తక్కువ లేదా మధ్య ఆదాయ దేశాలని తెలిపింది. సుమారు 1బిలియన్‌ ప్రజలు నివసించే 33 దేశాల్లోని పిల్లలకు వాతావరణ ప్రమాదాలు అధికంగా ఉన్నాయని గుర్తించగా, వాటిలో 29 దుర్భలమైన దేశాలుగా పరిగణించినట్లు నివేదిక వెల్లడించింది. వరదలు, తుపానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఉపాధ్యాయుల, విద్యార్థుల మరణాలకు దారితీశాయని, పాఠశాలలను దెబ్బతీసి, నాశనం చేశాయని అధ్యయన బృందం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -