Friday, February 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసైన్సుకు దేశంలో గడ్డుకాలం!

సైన్సుకు దేశంలో గడ్డుకాలం!

- Advertisement -

భారత ప్రభుత్వం వారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మూడు ముఖ్యమైన సైన్స్‌ అకాడెమీలకు నిధులు సమకూరుస్తుంది. అవి-

  1. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడెమీ (ఐఎన్‌ఎస్‌ఎ)
  2. నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌, ఇండియా (ఎన్‌ఎఎస్‌ఐ)
  3. ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఎఎస్‌)

    ఈ మూడూ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఈ దేశ ప్రజలకు ఉపయోగకరమైన పరిశోధనలు చేయడం వీటి ధ్యేయం! అంతేకాదు, దేశంలో ఉత్తమ పరిశోధనలు చేస్తూ, సమాజానికి మేలు చేస్తున్న శాస్త్రజ్ఞుల్ని గుర్తించడం, వారికి అవార్డులు ప్రకటించి ప్రోత్సహించడం వీటి ఉద్దేశం. ఇందులో మూడవది ఇండియన్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఎఎస్‌) అవార్డులు ప్రకటించదు. కానీ, మొదటి రెండు దేశవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, విద్య, ఆరోగ్య రంగాల్లో కొన్ని వందల సంఖ్యలో ప్రతియేటా అవార్డులు ప్రకటిస్తోంది. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల సిలబస్‌లోంచి వైజ్ఞానిక విషయాలు, చారిత్రక అంశాలు తొలగించి తమ హిందుత్వ ఎజెండాను అమలు పరచాలనుకుంటున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విజ్ఞాన్‌ ప్రసార్‌ లాంటి గొప్ప వైజ్ఞానిక సంస్థను కూడా మూసేసింది. అంటే వైజ్ఞానిక స్పృహకు దేశంలో తలుపులు మూసేసింది. వీటన్నిటిని ప్రారంభించి, ప్రోత్సహించింది భారత తొలి ప్రధాని పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ గనక, ఆయనపై ఉన్న వ్యక్తిగత కక్ష కారణంగానే వైజ్ఞానిక సంస్థలు మూసివేయడం, వాటికి ప్రతియేటా ఇవ్వాల్సిన నిధులు అందివ్వకపోవడం చేస్తున్నారమో! ఇప్పటికే జవహర్‌ లాల్‌ నెహ్రూ మ్యూజియం పేరు మార్చి-పి.యం. మ్యూజియం -అని ప్రకటిం చడం మనకు తెలుసు ఇంతటితో ఆగకుండా ప్రతియేటా శాస్త్రవేత్తలకు ఇచ్చే అవార్డులను కూడా రద్దుచేసింది.

    2022లో సుమారు మూడు వందల సైన్స్‌ అవార్డులను రద్దుచేసిన శాస్త్ర,సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఈ సంవత్సరం మరో ముందడుగు వేసి, తొంభై రెండు సైన్స్‌ అవార్డుల్ని రద్దుచేసింది. ఇలాంటి విషయాలకు పత్రికలు, మీడియా విస్తృత ప్రచారమివ్వవు. అందువల్ల సామాన్య జనానికి విషయాలు తెలియవు. కేంద్ర ప్రభుత్వ నిధులు అందుకుంటున్న అకాడెమీలు ఇచ్చే అవార్డులు ఇకపై కొనసాగించరాదని ఈ ఆరెస్సెస్‌- బీజేపీ ప్రభుత్వం భావించింది. యువ శాస్త్రవేత్తలు, సైన్సు టీచర్లు, లెక్చరర్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన సైంటిస్టుల కోసం వివిధ స్థాయిల్లో ఇస్తున్న పలు రకాల అవార్డులన్నీ ఇప్పుడు రద్దయిపోయాయి.

    తమకు దక్కాల్సిన గుర్తింపుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినందుకు వివిధ పరిశోధనాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు అందరూ ఆందోళన పడడం, పెద్దఎత్తున తమ నిరసనలు తెలియజేయడం మామూలే! – అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏ విషయంలో చీమకుట్టింది గనుకా? గతంలో పద్మశ్రీలు, పద్మ భూషణ్‌లు, సాహిత్య అకాడెమీ అవార్డుల్ని (అవార్డు వాపసీ) ప్రస్తుత ప్రభుత్వానికి తిప్పికొట్టినప్పుడే ఈ ప్రభుత్వం సిగ్గుపడ లేదు. ఇక ఇప్పుడు పడాలని ఎందుకు అనుకుంటుందీ? ఇక మిగిలింది ఒక్కటే – ఈ దేశంలో విజ్ఞాన శాస్త్రం ఎవరూ చదవగూడదు – అని చట్టం తీసుకురావడమే! ఇంత చేసిన వారు ఇక ముందు అది కూడా చేయరని నమ్మకమేమిటీ? మన కేంద్ర ప్రభుత్వంపై మనకు తప్పకుండా నమ్మకముండాలి. కాబట్టి, వారు సులభంగానే ఈ కింది చట్టాలు తేగలరు.

    1.దేశంలో ప్రశ్న బతికి ఉండకూడదు.
    2.దేశంలో వైజ్ఞానిక స్పృహ ఉండకూడదు.
    3.గత జ్ఞాపకాలు ఎవరికీ ఉండకూడదు. ఎవరూ గత చరిత్రను తవ్వి తీయగూడదు.
    4.ప్రభుత్వం వారి ‘మన్‌ కీ బాత్‌’ మాత్రమే విని చెవులు ఊపుతూ ఉండాలి.
    5.’దేశంలో మేం ప్రజాస్వామ్యాన్ని గొప్పగా బతకనిస్తున్నాం’ అని మన దేశ నాయకులు విదేశాల్లో చెప్పి వస్తుంటారు. వాటిని విని నోరు మెదపకూడదు.గమ్మున కూర్చోవాలి.
    6.’మైనార్టీలను స్వంత బిడ్డల్లా చూసుకుంటున్నామని’ అంతర్జాతీయ వేదికల మీద మన నాయకులు ప్రసంగించి వస్తారు. మనమిక్కడ చప్పట్లు చరుస్తుండాలి.
    7.’బేటీ బచావో..బేటీ పడావో’- నినాదాన్ని ప్రతి ఊర్లో సందుగొందుల్లో గొంతెత్తి నినదించాలి.
    8.దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మహిళా క్రీడాకారుల మీద దౌర్జన్యం చేశారని తెలిసినా నోరు విప్పగూడదు.

    9.అమెరికా పర్యటనలో వైట్‌హౌజ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌ – భారతదేశంలో జరుగుతున్న హిందుత్వ ఆఘాయిత్యాల మీద, గుజరాత్‌ మానవ హననం మీద, జాతి వివక్ష మీద, అసమర్థ పాలన మీద విలేకరులు సంధించిన కేవలం రెండు ప్రశ్నలకు కూడా సమాధాన మివ్వకుండా ‘ప్రజాస్వామ్యం మా డిఎన్‌ఎలో ఉందని’ మన ప్రధాన నాయకుడు పిట్టకథ చెప్పి వచ్చిన అంశాన్ని ఎక్కడా ప్రస్తావించ గూడదు.
    10.వాషింగ్టన్‌ డి.సి. ప్రధాన వీధుల్లో భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడి జనం విమర్శలు గుప్పిస్తుంటే మన ప్రధాన నాయకుడు నోరు మెదపకుండా నవ్వుతూ ఏడుపు మొహం వేసుకుని రాలేదా? దానిగురించి ఎక్కడా మాట్లాడకూడదు.
    11.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఒక ఇంటర్వ్యూలో భారత ప్రధానిని ఉద్దేశించి సంధించిన ప్రశ్నలు వినిపించినా వినపడనట్లే నవ్వుతూ చెయ్యి ఊపుతూ ఆయనగారు అక్కడ తిరగ లేదా? అంత పెద్ద స్థాయిలో ఉన్న వాడికి లేని సిగ్గు – సామాన్య మానవులం మనకు ఎందుకబ్చా? పట్టించుకోవద్దు కదా? మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన చర్మాన్ని మనమే మందంగా తయారు చేసుకోవాలి! తప్పదు మరి భారత ప్రధాని పర్యటనపై స్పందిస్తూ ముగ్గురు ప్రతిభావంతులైన ప్రముఖ అమెరికా సెనెటర్లు చెప్పిన విషయాలు చూద్దాం. ఇందులో మొదటి ఇద్దరు మహిళలు. చాలా తీవ్రమైన పదజాలంతో నేటి భారత ప్రభుత్వం పట్ల తమ అసహనాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.

    మానవ హక్కులకు విఘాతం కలిగిస్తూ, జర్నలిస్టులను హింసిస్తూ ప్రజాస్వామ్యాన్ని అభాసు పాలు చేసిన ఘనమైన చరిత్ర ప్రస్తుత భారత ప్రధానిది. -కోరి బుష్‌.
    మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగించిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గౌరవించకూడదు. -ఒకసియో కోర్స్ట్‌
    ప్రధాని మోడీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను ధ్వంసం చేసింది. ప్రతిపక్ష సభ్యుల మీద నేరాలు మోపింది. జైలు పాలు చేసింది. పౌర సంఘాల స్వేచ్ఛను హరించింది. -బెర్ని సాండర్స్‌.

    దేశంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, గతంలో అమెరికా అధ్యక్షుడు ఎందుకంత ఘనంగా భారత ప్రధానిని ఆహ్వానించాడు? అందులో ఉన్న రహస్యమేమిటీ – అంటే ఇరు దేశాల మధ్య ఉన్న లావాదేవీలు ముఖ్యకారణం – అంతకు మించి అక్కడ భారత ప్రధానికి వ్యక్తిగతంగా లభించిన గౌరవమేమీ లేదు.

    1.భారతదేశం మంచి కొనుగోలుదారు. ఆయుధాలు అమ్మడంలో అమెరికాది అగ్రస్థానం. కొనుగోలు చేయడం లో ప్రపంచదేశాల్లో భారతదేశానిది అగ్రస్థానం. మంచి కొనుగోలుదారుణ్ణి ఏ అమ్మకందారుడూ వదులుకోడు కదా?
    2.భారత్‌లో జరుగుతున్న అంతర్గత విషయాలను విమర్శిస్తూ – వ్యాపార పరంగా వచ్చే లాభాల్ని చెడగొట్టుకోవడం ఎందుకూ? అది అక్కడి ప్రభుత్వానికి సచ్చదు కదా?
    3.అమెరికాలో భారత సంతతి వారు ఎక్కువ. పైగా అక్కడ ముఖ్య భూమిక పోషిస్తున్నవారు కూడా ఎక్కువే. భారత ప్రధాని పట్ల అక్కడి ప్రభుత్వం గౌరవంగా వ్యవహరించి నట్లయితే భారతసంతతికి చెందిన అమెరికా పౌరుల నుండి అమెరికా ప్రభుత్వానికి మద్దతు బలంగా ఉంటుంది కదా?
    4.అమెరికా అధ్యక్షుని నివాస భవనంలో అక్కడి విలేకరులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు భారత ప్రధాని నేరుగా సమాధానం చెప్పకపోయినా కూడా అక్కడి విలేకరులు విరుచుకు పడలేదు. కారణం అధ్యక్ష భవనంలోని ప్రొటోకాల్‌. అయితే ‘టెలివిజన్లలో ప్రత్యక్షంగా చూసిన ప్రపంచ పౌరులంతా భారత ప్రధాని మేధో సంపత్తిని బేరీజు వేసుకునే ఉంటారు.
    5.దేశంలో అవార్డులు రద్దుచేసి, తగుదునమ్మా అని ఈజిప్టు వారిచ్చిన అవార్డు పుచ్చుకుని రావచ్చా? అలాంటి వారికి ఆ అర్హత ఉంటుందా?ఈ దేశ ప్రజలు ఆలోచించాలి.

    జనవరిలో జరగాల్సిన సైన్స్‌ కాంగ్రెస్‌కు అన్ని రకాల వనరుల సాయం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వారి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ప్రకటించింది. ఈ రకంగా కూడా భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ మీద నేటి మోడీ ప్రభుత్వం ఉక్రోషం వెళ్లగక్కుకుంది. ఆ రకంగా దేశాన్ని వెనకి నడిపించడంలో విజయవంతంగా మరో ముందడుగు వేసింది!
    విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌, సుప్రసిద్ధ సాహితీవేత్త.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -