Thursday, May 1, 2025
Homeఖమ్మంరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…

మే 5 నుండి జూన్ 13 వరకు అవగాహన శిబిరాలు
రైతులూ సద్వినియోగం చేసుకోండి
– ఏడీ జే.హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

మెరుగైన సాగు పద్ధతులు పై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను  సమాయత్తం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్  తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చేపట్ట నున్నది అని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్ గురువారం తెలిపారు. ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్యక్రమం వివరాలను వెల్లడించారు.  తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా  మే 5 నుండి జూన్ 13 వరకు ఆరు వారాలపాటు ఈ అవగాహన శిబిరాలను నిర్వహిస్తుందని, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు 8 బృందాలుగా  ఏర్పడి ఆరు వారాల పాటు అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, వేంసూరు, ములకలపల్లి మండలాల్లోని 48 గ్రామాలలో గల వ్యవసాయ దాని అనుబంధ అధికారుల సమన్వయంతో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ఈ బృందాలలో  ఇద్దరు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో పాటు వ్యవసాయ విద్యార్థులు కూడా  పాల్గొని రైతు సోదరులకు  ఆరు అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు. 
ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా యూరియా వాడకాన్ని తగ్గించడం, రసాయనాలను అవసరం మేరకు వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, ఖరీఫ్ లో రైతులు ఉపయోగించే విత్తనాలు కొన్నప్పుడు రసీదును  భద్రపరచుకోవడం, వివిధ పంటల్లో సాగునీటిని ఆదా చేసే అవసరమైన పరిజ్ఞానాన్ని, ప్రత్యామ్నాయ పంటల వివరాలను,చెట్ల పెంపకం లాంటి అంశాలపై శాస్త్రవేత్తలు, అధికారులు రైతులకు సూచనలు ఇస్తారని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం  రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలపై దృష్టిని సారించి లాభాల బాటలో పయనించేలా రైతులను చైతన్య పరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం అన్నారు. ప్రస్తుతం రైతుల ముంగిట్లో కి శాస్త్రవేత్తలను తీసుకురావడం వల్ల రైతుల సాంకేతిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం భావించి  ఈ వినూత్న పద్దతిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టనుంది అని అన్నారు. ఈ పర్యటనల ద్వారా  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు స్వయంగా తెలుసుకొని వ్యవసాయ అనుబంధ శాఖల సహకారం ద్వారా పరిష్కారాలు చూపిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన బృందాలు గ్రామాల్లోకి వచ్చినప్పుడు  రైతు సోదరులు అధిక సంఖ్యలో ఈ అవగాహన కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్  డాక్టర్ హేమంత్ కుమార్  విజ్ఞప్తి చేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img