Friday, October 31, 2025
E-PAPER
Homeజాతీయంఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు కత్తెర

ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు కత్తెర

- Advertisement -

కేంద్ర వేతన సంఘం ప్రస్తావనాంశాలను ఖండించిన సీఐటీయూ

న్యూఢిల్లీ : ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) ప్రస్తావనాంశాలను సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. ఉద్యోగుల చట్టబద్ధమైన ప్రయోజనాలు, హక్కులకు, మొత్తంగా ఆర్థికవ్యవస్థకు తీవ్ర హాని కలిగించేలా పొదుపు చర్యలను మరింత ముందుకు తీసుకెళ్ళాలన్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యంపై తీవ్ర సందేహాలు లేవనెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం కమిషన్‌ చైర్మన్‌ను, తాత్కాలిక సభ్యుడిని నియమించడానికి, అలాగే బీహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను ఆమోదించడానికి దాదాపు ఏడాది సమయం తీసుకుంది. కేవలం ఢిల్లీ ఎన్నికల ముందు సిపిసికి సంబంధించి తొలి ప్రకటన వెలువడింది.చైర్మన్‌పై, నిబంధనలపై నిర్ణయం తీసుకోవడంలో ఇంతగా జాప్యం చేయడంతో ఉద్యోగులు ఒకవేళ కమిషన్‌ సిఫార్సుల వల్ల తమకు రావాల్సిన లబ్ది ఏదైనా పొందాలన్నా దాదాపు రెండేండ్లు వేచి వుండాల్సి వచ్చింది.

ఈ నిబంధనలు, పైగా ‘నిధులు లేని, చందాయేతర పాత పెన్షన్‌’, ‘ఆర్థిక వివేచన, ఆర్థికావకాశాలు’ వంటి పదాలు ఉపయోగించడం, కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు ఉద్దేశ్యాలు, తప్పుడు భాష్యాలు ఉద్యోగుల వేతనాలు, ప్రోత్సహకాలు, పెన్షన్‌, ఇతర ప్రయోజనాల పెంపుపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని ఆ ప్రకటన పేర్కొంది. ఫైనాన్స్‌ బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వాలిడేషన్‌ యాక్ట్‌ నేపథ్యంలో ఈ ప్రస్తావనాంశాలు పెన్షనర్ల పెన్షన్‌, ఇతర ప్రయోజనాలపై చాలా వినాశకరమైన విధ్వంసాన్ని కలిగిస్తాయి. కేంద్ర వేతన కమిషన్‌ కసరత్తులో భాగంగా దీన్ని తక్షణమే రద్దు చేయాలి. ఉత్పత్తితో ముడిపడిన రాయితీ (పిఎల్‌ఐ), కేపెక్స్‌ రాయితీ, ఉపాధితో ముడిపడిన రాయితీ (ఇఎల్‌ఐ), ఎలక్ట్రానిక్స్‌ విడిభాగాల తయారీ రాయితీ, ఇంకా పన్నుల్లో కోతలు, బ్యాంక్‌ రుణాల రద్దు వంటి పలు రాయితీల రూపాల్లో కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయిలు కట్టబెట్టే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు వచ్చే పెన్షన్లు ఇతర ప్రయోజనాల్లో కోత విధించడానికి ప్రయత్నిస్తోందని సీఐటీయూ విమర్శించింది.

నయా ఉదారవాదం ప్రయోజనాలకు అనుగుణంగా వుండేలా మొత్తంగా పెన్షన్‌ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఈ నిబంధనలు సమర్ధవంతంగా ఉపయోగపడవచ్చు కానీ దీనివల్ల పాత, భవిష్యత్‌ పెన్షన్‌దారులు దెబ్బతింటారని పేర్కొంది. ఎన్‌పిఎస్‌ కింద వున్న ఉద్యోగులను యూపీఎస్‌ కిందకు తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం ప్రస్తుతమున్న ఒపిఎస్‌ను కాలరాసే నిబంధనలను తీసుకువచ్చింది. ఎన్‌పిఎస్‌, యూపీఎస్‌లను తిరస్కరిస్తూ ఒపిఎస్‌ కన్నా మరేది తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ నిబంధనలను ఆయుధంగా ఉపయోగిస్తోందని విమర్శించింది. ఉద్యోగులు, పెన్షనర్ల (ఒపిఎస్‌ కిందకు తీసుకువచ్చే) వేతనాలు, ఇతర ప్రయోజనాలన్నీ పెరిగేలా బేషరతుగా కమిషన్‌ నిబంధనలను సవరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఐటియు విజ్ఞప్తి చేసింది. నయా ఉదారవాద పొదుపు చర్యలకు వ్యతిరేకంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు చేసే పోరాటాలకు సీఐటీయూ బాసటగా వుంటుందని తపన్‌సేన్‌ ఆ ప్రకటనలో హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -