అఫ్జల్‌సాగర్, వినోభా కాలనీలో పర్యటించిన హైడ్రా కమిషనర్
నాలాలపై ప్రధాన ఆటంకాల తొలగింపుకు చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో నాలాల్లో పడిపోయి గల్లంతైన ముగ్గురి ఆచూకీ కోసం హైడ్రా ముమ్మరంగా గాలిస్తోంది. క్యాచ్‌పిట్లన్ని చోట్ల వెతుకుతోంది. ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాతోపాటు ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలా పరిసరాల్లో గాలింపు చర్యలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. ప్రతి క్యాచ్‌పిట్‌ను తెరిచి చూసిన తర్వాత వెంటనే వాటిని మూసేయాలని హైడ్రా సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ కురిసిన భారీ వర్షానికి ఆసిఫ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ నాలాలో మామఅల్లుడు అర్జున్, రాముతోపాటు ముషీరాబాద్‌లోని వినోభానగర్ నాలాలో దినేష్ అలియాస్ సన్నీ గల్లంతైన విషయం విదితమే. సోమవారం కూడా హైడ్రా గాలింపును ముమ్మరం చేసింది. జీహెచ్‌ఎంసీ, వాటర్ బోర్డు, ఫైర్ పోలీసు తదితర శాఖలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. అఫ్జల్‌సాగర్ పాంత్రంలో గాలింపు చర్యలను కమిషనర్‌తోపాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పరిశీలించారు.
నాలా ఆక్రమణలే ప్రమాదాలకు కారణం : హైడ్రా కమిషనర్
నాలాల ఆక్రమణలే ప్రమాదాలకు కారణమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో అన్నారు. నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడమే కాకుండా, నీటి ప్రవాహాన్ని అశాస్త్రీయంగా దారి మళ్లించడంతో వరద సాఫీగా సాగడం లేదన్నారు. నాలాల సమస్య మూలాలకు వెళ్లి పరిష్కరించాల్సినవసరం ఉందన్నారు. వరద ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఒకటి రెండు కట్టడాలనే తొలగిస్తామని, మిగతా వారు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. నాలాల చెంతన పేదలే ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, తప్పనిసరిగా కూల్చి వేయాల్సి వస్తే వారికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం చూస్తుందన్నారు. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలతో కలిసి అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. భారీ వర్షం పడితే అమీర్‌పేట పరిసరాలు నీట మునిగేవని, అండర్‌గ్రౌండ్‌లో పూడుకుపోయిన నాలాలను తెరవడంతో ముప్పు తప్పిందని అన్నారు. 25 లారీల వ్యర్థాల పూడికను ఒకే చోట తీసినట్టు కమిషనర్ తెలిపారు. ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకూ 2200 లారీల వ్యర్థాల పూడికను తొలగించామని, ఇది నిరంతరంగా సాగుతుందని, నగర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రతి ఏటా వర్షాకాలంలో ఇదే సమస్య ఎదురవుతోందని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు.