Wednesday, July 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీజనల్‌ వ్యాధులను నియంత్రించాలి

సీజనల్‌ వ్యాధులను నియంత్రించాలి

- Advertisement -

– క్షేత్రస్థాయిలో క్యాంపులు నిర్వహించాలి : రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-బయ్యారం

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులు నియంత్రించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంగళవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రత్యేక అధికారి వాసం వెంకటేశ్వర్లు.. మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం పీహెచ్‌సీ కేంద్రాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి పీహెచ్‌సీలో అందుతున్న వైద్యాన్ని, వివిధ విభాగాల సేవలను ప్రత్యేక అధికారికి తెలిపారు. బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జఫ్ఫాబాద్‌ గ్రామాన్ని సందర్శించి అక్కడ డెంగ్యూ వచ్చిన వారి ఇండ్లను సందర్శించి వారికి ఏ విధమైన చికిత్స అందించారని తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. బయ్యారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మందుల సరఫరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్‌ అయిన పేషెంట్లను విచారించి చికిత్స ఏ విధంగా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ను సందర్శించి ఫీవర్‌ వార్డు, ఫార్మసీ స్టోర్‌, ల్యాబ్‌, ఐసీటీసీ సెంటర్‌ను పరిశీలించారు. హాస్పిటల్‌ పరిసరాలు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా వైద్యాధికారి, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసం వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. బయ్యారం పీహెచ్‌సీ కేంద్రంలో వైద్య సేవలు అందుతున్న తీరు బాగుందని, ఆస్పత్రి అంతా శానిటేషన్‌ నిర్వహణ చక్కగా ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త, చెదారం లాంటివి ఉన్నట్లయితే వెంటనే చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా శానిటైజేషన్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరికీ వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించి వైరస్‌ బారిన పడకుండా చూడాలన్నారు. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, మందుల నిల్వలు సరిపడా పెట్టుకోవాలని తెలిపారు. పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళలోని విద్యార్థులకు ఫీవర్‌ సర్వే చేసి అవసరమైన వారికి టెస్టులు చేయాలని ఆదేశించారు. మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని అన్నారు. జిల్లాను సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా నిలిచే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజు, జిల్లా వైద్యాధికారి డా.రమేష్‌ రాథోడ్‌, డీపీఓ హరిప్రసాద్‌, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస రావు, మహబూబాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రాజేశ్వర్‌, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి ప్రసాద్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కేవీ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -