Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీజనల్‌ వ్యాధులు ప్రబలొద్దు

సీజనల్‌ వ్యాధులు ప్రబలొద్దు

- Advertisement -

– నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
– వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తత అవసరం
– పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
– కామారెడ్డి జిల్లాలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష
– మహిళల అభివృద్ధితోనే సమాజాభివృద్ధి అని పునరుద్ఘాటన
నవతెలంగాణ- నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

వానాకాలంలో దోమల ఉధృతి పెరిగి వాటి వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశం ఉంటుందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాలో సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి (ధనసరి అనసూయ) సీతక్క సూచించారు. ఈ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. తాగునీరు కలుషితమైతే డయేరియా వ్యాపిస్తుందని, కాబట్టి కలుషితం కాకుండా పైప్‌లైన్‌లను సరి చూసుకోవాలన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటిన మంత్రి సీతక్క.. మొదట జిల్లా కేంద్రంలో మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూల్‌(బాలికలు)లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులతో సమీక్షించారు. హై రిస్క్‌ ప్రాంతాల్లో డెంగ్యూ ప్రబలకుండా మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందులు, పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలందిం చాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై ప్రజాప్రతినిధులు చేసిన సూచనలపై అధికారులకు పలు సూచనలిచ్చారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఉన్న ఐకేపీ మహిళా సంఘాలు నడిపిస్తున్న క్యాంటీన్‌లో ఆహార పదార్థాలను రుచి చూసి మెచ్చుకున్నారు.మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, వారు వృద్ధి చెందినప్పుడే సమాజం ప్రగతిలో ముందుంటుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చెప్పిన విషయాన్ని సీఎం అమలు చేస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. సమీక్ష అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం రూ.20.56 కోట్ల చెక్కును, కామారెడ్డి నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు రూ.5.28 కోట్ల వడ్డీ రాయితీ చెక్కును, లోన్‌ బీమా కింద రూ.22 లక్షల చెక్కును, ప్రమాద బీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబాలకు రూ.10 లక్షల, రూ.30లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమాల్లో మహిళా శిశుఅభివృద్ధి శాఖ కమిషనర్‌ అనితా రామచంద్రన్‌, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ అశీష్‌ సాంగ్వన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌ రావు, తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ బాలరాజు, జిల్లా ఎస్పీ రజేష్‌ చంద్ర, జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, జిల్లా అదనపు ఎస్పీ చైతన్య, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్‌, చందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -