– రెగ్యూలేటరీ మాజీ చీఫ్ మాధబి బచ్
ముంబయి : భారత స్టాక్ మార్కెట్లలో వేలాది కోట్ల అక్రమార్జనకు పాల్పడినట్టు అమెరికన్ సంస్థ జెన్ స్ట్రీట్‌పై రుజువులు బయటపడుతోంటే.. మరోవైపు దీనిపై భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్‌పర్సన్ మాధబి పూరి బచ్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఈ కుంభకోణంలో సెబీ నియంత్రణ వైఫల్యం లేదన్నారు. ఏప్రిల్ 2024 నుంచి ఈ విషయంపై సెబీ చురుకుగా విచారణ చేస్తోందని తెలిపారు. నియంత్రణ వైఫల్యంపై వస్తోన్న వార్తలను అమె ఖండించారు. జెన్ స్ట్రీట్‌పై 105 పేజీల రిపోర్ట్‌ను తయారు చేశామన్నారు. ఇది తన పర్యవేక్షణలోనే ప్రారంభమైందన్నారు. జెన్ స్ట్రీట్ సంస్థ దాదాపు రూ.44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ ఇటీవల నిర్థారించింది. చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడిన అమెరికాకు చెందిన జెన్ స్ట్రీట్ గ్రూపు సంస్థలను సెబీ శుక్రవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
జెన్ స్ట్రీట్ మోసంలో మాధబి పూరి బచ్ వ్యక్తిగత సంబంధాలు లేదా స్వార్థ ప్రయోజనాలు ఉండొచ్చని ఆరోపణలు వచ్చాయి. హెచ్‌ఎండి రీసెర్చ్ నివేదికలో మాధబి బుచ్, ఆమె భర్తకు కొన్ని కంపెనీలతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, అవి సెబీ నిర్ణయాలను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ ఆరోపణలు సెబీ పారదర్శకత, నీతిపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ ఆరోపణలను మాధబి బుచ్ తిరస్కరించారు. తన నిర్ణయాలు నిష్పక్షపాతంగా, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. సెబీ ఛైర్మన్‌గా మాధబి బచ్ బాధ్యతలు ఉన్న కాలంలోనే.. జెన్ స్ట్రీట్ జనవరి 2023 నుండి మే 2025 వరకు జెన్ స్ట్రీట్ వేల కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను కలిగించింది. బచ్ పదవీకాలంలో నియంత్రణ లోపాలు, పెద్ద గ్లోబల్ ఫండ్స్‌పై దృష్టి పెట్టకుండా చిన్న సంస్థలపై అతిగా నియంత్రణ విధించడం, హెచ్చరిక సంకేతాలను విస్మరించారని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
సెబీ తమ సంస్థలపై నిషేధం విధించడంతో పాటు తమ నగదును అటాచ్ చేయడంపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయనున్నట్లు జెన్ స్ట్రీట్ తెలిపింది. కోర్టులో సవాలు చేయడంతో న్యాయ పోరాటానికి దిగుతామని పేర్కొంది. అక్రమ పద్దతుల్లో దేశీయ స్టాక్ మార్కెట్‌లో కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన అమెరికన్ సంస్థ జెన్ స్ట్రీట్‌ను విచారిస్తామని సెబీ ప్రస్తుత చైర్మెన్ తుహిన్ కాంత పాండే స్పందించారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాండే మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగబోవన్నారు. నిఘా వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారిస్తామన్నారు. ఈ తరహ మోసాలకు అవకాశమివ్వమని పేర్కొన్నారు. ఇందులో నిఘా వ్యవస్థ లోపం కూడా ఉందని పాండే ఒప్పుకున్నారు.