– జెన్ స్ట్రీట్‌పై నిషేధం ఎత్తివేత
– వేల కోట్లు కొల్లగొట్టిన అమెరికా సంస్థకు మళ్లీ అనుమతులు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్‌లో అక్రమ పద్ధతుల ద్వారా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అమెరికా హెడ్జ్ ఫండ్ జెన్ స్ట్రీట్‌పై విధించిన నిషేధాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు (సెబీ) ఎత్తివేసింది. తాము విధించిన రూ.4,800 కోట్ల జరిమానాను ఆ సంస్థ ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేసిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లోకి మళ్లీ ప్రవేశించేందుకు అనుమతిచ్చినట్టు సెబీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీంతో మార్కెట్ రెగ్యూలేటర్ సెబీ పారదర్శకతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ద్వారా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ల్లో తప్పుడు పద్దతుల్లో రూ.43,289 కోట్ల అక్రమ లాభాలు ఆర్జించినట్టు సెబీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే జులై తొలి వారంలో జెన్ స్ట్రీట్‌పై నిషేధం విధించింది. ఈ అక్రమార్జనపై విచారణ పూర్తి కాకుండానే, రిటైల్ ఇన్వెస్టర్లను నిండా ముంచిన ఆ సంస్థపై ఆంక్షలు ఎత్తివేయడం ఆందోళకరం. జులై 13న రూ.4,800 కోట్లు ఎస్క్రో ఖాతాలో జమ చేయడంతో జెన్ స్ట్రీట్‌పై సెబీ నిషేధాన్ని ఎత్తివేశాయని.. అయితే.. ఆప్షన్స్ ట్రేడింగ్‌పై నిషేధం కొనసాగుతోందని సెబీ వర్గాలు పేర్కొన్నాయి. నిషేధం ఎత్తివేసిన విషయాన్ని అటు జెన్ స్ట్రీట్‌తో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీలకు, డిపాజిటరీలకు, కస్టోడియన్లకు సెబీ సమాచారం ఇచ్చింది.అక్రమ పద్ధతులకు పాల్పడిన జెన్ స్ట్రీట్ సంస్థపై సెబీ జులై 3న చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ దాదాపు రూ.44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు సెబీ గుర్తించింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లు, నగదు విభాగంలో రూ.288 కోట్లు పోగొట్టుకుంది. ఈ నష్టాలను మినహాయిస్తే.. నికరంగా రూ.36,671 కోట్లు అక్రమంగా సంపాదించింది. అందులో రూ.4,843 కోట్ల సొమ్మును మాత్రమే జరిమానగా చెల్లించాలని సెబీ ఆదేశించడం గమనార్హం.
పారదర్శకతకు సెబీ పాతర
- Advertisement -
- Advertisement -