పార్టీలకతీతంగా లబ్దిదారుల ఎంపిక
త్వరలో డిజిటల్ మీడియా పాలసీ
శాసన మండలిలో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం శాసనమండలిలో అద్దంకి దయాకర్, మదుసూధనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, ఎల్ రమణ, నెల్లికంటి సత్యం, తక్కళ్లపల్లి రవిందర్‌రావు, తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఇప్పటికే మొదటి విడతలో మూడు లక్షలకుపైగా ఇండ్లను మంజూరు చేశామనీ, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామని చెప్పారు. రాబోయే మూడేండ్లలో పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామన్నారు. గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని అన్నారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలనే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఎంపికలో పొరపాట్లు జరిగితే చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి లక్ష ఇండ్లు పూర్తి కానున్నాయని అన్నారు. డబుల్ బెడ్ రూం పథకం పెండింగ్ బిల్లులను 99 శాతం చెల్లించామన్నారు.
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై త్వరలో నిర్ణయం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ విషయంలో సీఎం స్పష్టత ఇచ్చారనీ, న్యాయస్థానం పరిధిలో ఇబ్బందుల్లేకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యాచరణ సిద్దం చేస్తున్నామన్నారు. రాబోయే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని ప్రకటించారు. జర్నలిస్టులకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో కొంత మంది లేనిపోని అపోహలను సష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఎలాంటి బేషజాలాలకు పోకుండా మొదట విడుదల చేసిన జీవోపై జర్నలిస్టుల సంఘాల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేసామని గుర్తు చేశారు.
ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



