Sunday, December 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మలి విడత పోలింగ్ ప్రశాంతం

మలి విడత పోలింగ్ ప్రశాంతం

- Advertisement -

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, అబ్జర్వర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాలో మలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9.00 గంటల సమయానికి సగటున 20.49 శాతం పోలింగ్ నమోదయ్యింది. 11 గంటల సమయానికి 49.13 శాతం ఓటింగ్ జరిగిందని అధికారులు ప్రకటించారు. 

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్ మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం ముల్లంగి, ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లు, మెడికల్ క్యాంపు, ఇతర అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా? అని తనిఖీ చేశారు. వృద్దులను తరలించేందుకు వీల్ చైర్లు వినియోగిస్తున్నారా, లేదా అని గమనించారు. కలెక్టర్ పర్యవేక్షణలో నిజామాబాద్ డివిజన్ లోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్ లోని జక్రాన్పల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు సజావుగా ఎన్నికలు జరిగాయి. 

రెండవ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికే 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా మొత్తం వార్డు స్థానాలు 1760 ఉండగా, 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని, 1081 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగిందని, 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలోనూ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. చలి తీవ్రత వల్ల మొదటి రెండు గంటల వరకు ఒక మోస్తరుగా సాగిన ఓటింగ్, అనంతరం వేగం పుంజుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 49.13 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలలో అవగాహనను పెంపొందించడం, ఫొటోలతో కూడిన ఓటరు స్లిప్పులను ఇంటింటికి తిరిగి ముందస్తుగానే పంపిణీ చేయడం, పోలింగ్ కేంద్రాలలో  బీ.ఎల్.ఓలతో కూడిన హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి ఓటర్లకు సహకరించడం వల్ల పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగిందని, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కలెక్టర్ అన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశామని, వెబ్ క్యాస్టింగ్ జరిపించామని, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును నిశితంగా పరిశీలన చేశారని అన్నారు.

కలెక్టరేట్ నుండి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ తీరును, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగిందన్నారు.  మద్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగగా, నిర్ణీత సమయం లోపు క్యూ లైన్లలో నిలుచున్న వారికి కూడా ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. అనంతరం మద్యాహ్నం 2.00 గంటల నుండి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించేలా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు. కౌంటింగ్ సందర్భంగా ఏ చిన్న తప్పిదానికి సైతం తావులేకుండా జాగ్రత్తగా ఓట్ల లెక్కింపు జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

కాగా, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం పోలింగ్ కేంద్రాలను విస్తృతంగా సందర్శిస్తూ ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలన జరిపారు. మోపాల్, మాక్లూర్, గుండారం, డిచ్ పల్లి మండలం ఘన్ పూర్, ఇందల్వాయి మండలం గన్నారం, ధర్పల్లి, సిరికొండ తదితర చోట్ల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరుతెన్నులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.అడిషినల్ డిజిపి బాస్వారేడ్డి, నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ తదితరులు డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలంలోని సిర్నపల్లి తోపాటు తదితర గ్రామాల్లో సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -