నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని 14 గ్రామ పంచాయతీల 112 మంది వార్డు సభ్యులకు ఈ నెల 2 నుంచి 07 వరకు జరిగిన మొదటి విడత శిక్షణ కార్యక్రమం ముగిసింది. పంచాయతీరాజ్ చట్టం, 24 అంశాలపై శిక్షకులు అవగాహన కల్పించారు. ఎంపీడీవో మానే ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలో వార్డు సభ్యుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చెశారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని వార్డు సభ్యులకు సూచించారు. తమ వార్డులలో ఉన్న మౌలిక వసతులు, విద్యుత్, తాగునీరు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు సమావేశాలలో చర్చించుకుంటూ సర్పంచ్ దృష్టికి తీసుకువస్తూ పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ పంచాయతీ సమావేశాలలో తగిన సూచనలివ్వాలని పేర్కొన్నారు.
భేషజాలకు పోకుండా ప్రజలకు అవసరమైన పనులను చేయడంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా చూడాలన్నారు. శిక్షణ పొందిన వార్డు సభ్యులకు ట్రైనింగ్ పత్రాలు అందజేశారు. రెండవ విడత మిగిలిన 14 గ్రామ పంచాయతీ ల 122 వార్డు సభ్యులకు నేటినుంచి నుంచి 14 వ తేదివరకు రెండవ విడత శక్షణ శిభిరం నిర్వహిస్తునట్లు తెలిపారు. మండల పంచాయతీ అధికారి విజయకుమార్, స్థానిక సర్పంచ్ వెంకటయ్య, ట్రైనర్స్ ఖాజా, నిరంజన్, సైదా నాయక్, రాజశేఖర్, మండల పంచాయత్ కార్యదర్శులు పాల్గొన్నారు.



