Wednesday, December 31, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంలౌకికతత్వానికే ప్రమాదం

లౌకికతత్వానికే ప్రమాదం

- Advertisement -

– ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులపై న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం
– మత విభజన తీవ్రం
– అన్ని వ్యవస్థల్లోకి చొరబాటు
– పారదర్శకత కరువు
న్యూయార్క్‌ :
భారతదేశ లౌకిక స్వరూపాన్ని మార్చి, దానిని ఒక హిందూ దేశంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) పనిచేస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ముస్లిములను, క్రైస్తవులను విదేశీ ఆక్రమణదారుల వారసులుగా చూపే ధోరణి పెరిగిందని, అందువల్ల దేశంలో మతపరమైన విభజనలు తీవ్రమవుతున్నాయని తెలిపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ 100వ వార్షికోత్సవం తరుణంలో, అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ (ఎన్‌వైటి) ఆ సంస్థ ప్రభావం, విస్తృతి, భారతదేశంపై దాని ముద్ర గురించి ఒక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ‘నీడల నుండి అధికారంలోకి: హిందూత్వ శక్తులు భారతదేశాన్ని ఎలా మారుస్తున్నాయి’ అనే శీర్షికతో వచ్చిన ఈ కథనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

తొలిసారి బహిరంగంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించిన ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన 11 ఏళ్ల పాలనలో ఎన్నడూ లేని విధంగా, గత ఆగస్టులో ఎర్రకోట నుండి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను బహిరంగంగా ప్రశంసించారని పత్రిక పేర్కొంది. తన జీవితాన్ని మలచిన సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఆయన అభివర్ణించారని, ఇది ఆ సంస్థకు ఉన్న ‘కింగ్‌ – మేకింగ్‌’ శక్తికి నిదర్శనమని కథనం విశ్లేషించింది.

అన్ని వ్యవస్థల్లోకి చొరబాటు
ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక సామాజిక సేవా సంస్థ మాత్రమే కాదని, అది భారతదేశంలోని దాదాపు అన్ని వ్యవస్థల్లోకి చొచ్చుకుపోయిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ప్రభుత్వం, న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ, మీడియా, విద్యా సంస్థల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ తన మూలాలను బలంగా నాటుకుందని పత్రిక తెలిపింది. బిజెపితో పాటు విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సేవా సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ఒక భారీ నెట్‌వర్క్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ నడుపుతోందని వివరించింది.

మతపరమైన దాడులు, వేధింపులు
ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థల పేరుతో జరుగుతున్న కొన్ని దాడులు, మతపరమైన వేధింపులు, చర్చిలపై దాడుల గురించి కూడా కథనం ప్రస్తావించింది. న్యాయవ్యవస్థలో కూడా హిందూత్వ భావజాలం ప్రభావం చూపుతోందని చెబుతూ, అలహాబాద్‌ హైకోర్టులో ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపింది.

పారదర్శకతపై ప్రశ్నలు
ప్రపంచంలోనే అతిపెద్ద మితవాద సంస్థగా ఎదిగినప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాల్లో పారదర్శకత లోపించిందని కథనం విమర్శించింది. సంస్థకు సంబంధించిన కచ్చితమైన రికార్డులు ఉండవని, దాని ఆస్తులు అనేక చిన్న ట్రస్టుల రూపంలో విస్తరించి ఉన్నాయని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ తన శతాబ్ది ఉత్సవాల వేళ అత్యంత శక్తిమంతమైన సంస్థగా ఎదిగిందని, ప్రధాని మోడీ తర్వాత కూడా దేశ రాజకీయాలను, సామాజిక గమనాన్ని శాసించే స్థాయిలో ఆ సంస్థ మూలాలు ఉన్నాయని న్యూయార్క్‌ టైమ్స్‌ తన విశ్లేషణలో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -